కలియుగదైవం, తెలుగుప్రజల ఆరాధ్య దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి కొలువుదీరిన పుణ్యక్షేత్రం మరోసారి వార్తల్లో అగ్రభాగన నిలిచింది. ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో హిందువులు సందర్శించే పుణ్యక్షేత్రమైన తిరుమలలో అన్యమత ప్రచారం, నిషేధిత పదార్థాలు, మద్యం, మాంసం, ధూమపానానికి అడ్డుకట్ట వేసేందుకు తీసుకున్న చర్యలు అంతంతమాత్రంగానే ఉంటున్నాయి. ఇతర మతాలతో పోలిస్తే హిందూ ధార్మిక సంస్థల పైనే ప్రభుత్వ పెత్తనం ఎక్కువుగా ఉండటంతోనే ఈ సమస్య తలెత్తిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఉత్తరాదిలో వలే ఆలయాల నిర్వహణకు పీఠాధిపతులు, మఠాధిపతులకు అప్పగిస్తే హిందూ బంధువులుకు మేలు జరుగుతుందని ఉదాహరణలతో హిందూ సంఘాల నేతలు చెబుతున్నారు. రాజకీయ పార్టీలు పరస్పర ఆరోపణలు చేసుకోవడం మినహా టీటీడీ ప్రక్షాళన కోసం చిత్తశుధ్ధితో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవడంలేదంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన చంద్రబాబు, శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకుని, తిరుమలతో పాటు మొత్తం దేవాదాయశాఖను ప్రక్షాళన చేస్తామని వెల్లడించారు. గత ప్రభుత్వం హయాంలో తీసుకున్న అడ్డగోలు నిర్ణయాలపై సమీక్ష చేయడంతో పాటు ఆలయాల పవిత్రతను కాపాడేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.
ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడటంతో పాత పాలకవర్గం తీసుకున్న హిందూ వ్యతిరేక నిర్ణయాలు అమలు నిలిపివేస్తామని ప్రకటించింది. పాత ఈవోను బదిలీ చేయగా, చైర్మన్ తానంతట తానే రాజీనామా చేశారు. కొత్త ఈవోగా సీనియర్ ఐఏఎస్ అధికారి శ్యామలరావును నియమించగా ఆయన టీటీడీ ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తున్నారు. అయితే పాలకపక్షంలో ప్రధాన పార్టీగా ఉన్న టీడీపీ, గత అధికారపార్టీ(వైసీపీ)పై విమర్శలు గుప్పిస్తోంది. గతంలో వైసీపీ అధికారంలోకి వచ్చినప్పుడు కూడా ఇదే తరహా ఆరోపణలు చేసింది. ఈ ఆరోపణలు పరంపరను పరిశీలిస్తే రాజకీయ పబ్బం గడుపుకునేందుకే పరస్పర ఆరోపణలకు దిగుతున్నట్లు కనిపిస్తోంది. అన్యమత ప్రచారం, చర్చీలు, మసీదు నిర్మాణాలు జరుగుతున్నట్లు వస్తున్న ఆరోపణలపై ఆయా రాజకీయ పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదు. తమ పార్టీ, తమ నేతల రాజకీయ పునరావసం కోసమే తిరుమల విషయాన్ని ఎన్నికల్లో లేవనెత్తుతున్నట్లు అర్థం అవుతోంది. టీటీడీకి సంబంధించి ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలు రాజకీయాలు దృష్టిలో పెట్టుకున్నట్లు అనిపిస్తోందని పలువురు అభిప్రాయపడుతున్నారు. టీటీడీలోని అన్యమతస్తులను బయటకు పంపేందుకు ఎందుకు వెనకాడుతున్నారని ప్రశ్నిస్తున్నారు. రాజకీయ లబ్ధి కోసం తిరుమలను వేదికగా చేసుకుంటే తగిన శాస్తి జరగడం ఖాయమని హెచ్చరిస్తున్నారు.
స్వామి శ్రీనివాసానంద స్వామిజీ –(హిందూ ధర్మ పరిరక్షకులు )
గత ప్రభుత్వాల హయాంలో తిరుమలలో తప్పులు జరిగినప్పటికీ వైసీపీ హయాంలో విధ్వంసం ఎక్కువ జరిగిందన్నారు. తిరుమల పుణ్యక్షేత్రం అన్నవిషయాన్ని వైసీపీ పాలకులు మరిచిపోయారని విమర్శించారు. జగన్ ప్రభుత్వం భయం, భక్తి లేకుండా వ్యవహరించిందన్నారు. శేషాచల కొండల్లో ఎర్ర చందనం కలపను కొట్టివేయడంతో భక్తుల మార్గంలోకి క్రూరమృగాలు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తిరుమలలో పాటించాల్సిన నియమాలను సీఎం జగన్ పాటించలేదన్నారు. బ్రహ్మోత్సవాలకు భార్య సమేతంగా జగన్ ఎందుకు రాలేకపోయారని ప్రశ్నించారు. డిక్లరేషన్ లో జగన్ సంతకం పెట్టలేదని ప్రశ్నించారు. టీటీడీ లోకి అన్యమత ఉద్యోగులును ఎందుకు తీసుకున్నారని దుయ్యబట్టారు. తిరుమలలో ఎన్నో అకృత్యాలకు పాల్పడి, తిరుపతి అభివృద్ధికి చర్యలు తీసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
డాక్టర్ వేంకటేశ్వర రాజు-( వీహెచ్పీ, అధికార ప్రతినిధి )
ధర్మకర్తల మండలిలోని సభ్యులకు ఆలయంలో జరిగే కార్యక్రమాలపై అవగాహన ఉండటం లేదన్నారు. క్రిమినల్ కేసులున్న వారికి చైర్మన్ పదవి, ధర్మకర్తల మండలిలో సభ్యుడిగా అవకాశం కల్పిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హోదాను అడ్డుపెట్టుకుని సౌకర్యాలను అమ్ముకుంటున్నారని తూర్పారబట్టారు. దేవుడి సొమ్ముపై ప్రభుత్వాల పెత్తనం ఏంటని ప్రశ్నించారు.
ఆదిశ్రీ, న్యాయవాది, (-టీటీడీని సమాచార హక్కు చట్టం కిందకు తీసుకురావాలని న్యాయపోరాటం చేస్తున్నారు.)
సింగిల్ విండో విధానాన్ని పాటించడంతో పాటు పారదర్శకతకు పెద్దపీఠ వేయాలని డిమాండ్ చేస్తున్నారు. లడ్డూ ప్రసాదం పవిత్రతను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఆర్టీఐ కిందకు టీటీడీని తీసుకువస్తే అన్ని వివరాలు ప్రజలకు తెలుస్తాయన్నారు. అన్యమతస్తులను హిందూ ఆలయాలు, సంస్థల్లో చోటు ఇవ్వడం సరికాదన్నారు. ఆగమ శాస్త్రానికి విరుద్ధంగా ఎలాంటి కార్యక్రమాలు జరగకూడదన్నారు.
విష్ణు-(అధ్యక్షుడు, సమరసతా ఫౌండేషన్, గిరిజన తండాలు, బడుగుల బస్తీల్లో ఆలయాల నిర్మాణం)
ధార్మిక ధర్మ ప్రచారంలో భాగంగా కొన్ని సేవా సంస్థలు, స్వామిజీలు, మఠాధిపతులు, పీఠాధిపతులు సహకారంతో తమ సంస్థ నడుస్తుందన్నారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో హిందూ ధర్మ ప్రచార పీఠం నుంచి ఇస్తామన్న నిధులు విడుదల చేయకుండా నిలిపివేశారన్నారు. టీడీపీ పాలనలో అట్టడుగు వర్గాల కాలనీల్లో ఆలయాలు కట్టాలని జీవో జారీ అయిందన్నారు. జీవో మేరకు 500 దేవాలయాలు కట్టామన్నారు. 2022లో వైఎస్ జగన్ హయాంలో 320 దేవాలయాలు కట్టేందుకు నిధులు ఇచ్చారన్నారు. ప్రభుత్వాలు ధర్మ ప్రచారానికి ఇవ్వలేదని ఆలయాల నిర్మాణానికి నిధులు ఇచ్చిందన్నారు. తిరుమలలో ధార్మిక సదస్సు జరుగుతున్నప్పుడు జరిగిన తీర్మానం మేరకు నిధులు విడుదల చేయలేదన్నారు.