మానవత్వం మంటకలిసింది. ప్రొద్దుటూరులో దారుణం చోటు చేసుకుంది. ప్రొద్దుటూరులోని వైఎంఆర్ కాలనీలో ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేసి, ముక్కలుగా చేసి సమీపంలోని ఉత్తర కాలువలో పడేసిన ఘటన సంచలనంగా మారింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. నాగరత్నమ్మ, కుమారుడు మహేశ్వరరెడ్డితో కలసి వైఎంఆర్ కాలనీలో నివాసం ఉంటోంది. 20 సంవత్సరాల కిందటే ఆమె భర్త చనిపోయారు. రామచంద్రారెడ్డి అనే క్యాటరింగ్ వ్యాపారితో సహజీవనం చేస్తోంది. కుమారుడు మహేశ్వర్‌రెడ్డి సమీపంలోని భారతి సిమెంట్ కంపెనీలో పనిచేస్తున్నారు. గత రాత్రి డబ్బు విషయంలో మహేశ్వర్‌రెడ్డి, భూమిరెడ్డి రామచంద్రారెడ్డి గొడవపడినట్లు పోలీసులు తెలిపారు.
అనారోగ్యంతో ఉన్న నాగరత్నమ్మ మత్తు గోళీ వేసుకుని నిద్ర పోయారు. తరవాత బాగా మద్యం సేవించి మహేశ్వర్‌రెడ్డి, భూమిరెడ్డి గొడవ పడ్డారు. ఈ గొడవలో మహేశ్వర్‌రెడ్డిని, రామచంద్రారెడ్డి గొడ్డలితో నరికి చంపినట్లు పోలీసులు తెలిపారు. ఆ తరవాత శరీరాన్ని ముక్కలుగా చేసి గోతంలో వేసుకుని ప్రొద్దుటూరు ఉత్తర కాలువలో పడేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. నిందితుడి కోసం గాలిస్తున్నారు. హత్యకు డబ్బు విషయంలో గొడవే కారణంగా పోలీసులు అనుమానిస్తున్నారు.