మధ్యప్రదేశ్‌లోని సివనీ జిల్లాలో గోవధ కేసుకు సంబంధించి జిల్లా కలెక్టర్ క్షితిజ్ సింఘాల్, ఎస్పి రాకేష్ సింగ్‌లను రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ వారి వారి పదవుల నుంచి తొలగించారు. కొత్త కలెక్టర్‌గా సంస్కృతీ జైన్, ఎస్పిగా సునీల్ కుమార్ మెహతాలను నియమించారు. గోవధ కేసును దర్యాప్తు చేయాలంటూ రాష్ట్ర సిఐడిని ఆదేశించారు. ఆ మేరకు ఆదివారం నాడు ఆదేశాలు జారీ చేసారు.
గతవారం వయిన్‌గంగా నది వెంబడి ధనోరా ప్రాంతం వద్ద, కకర్తలా అటవీప్రాంతంలోనూ 54 గోవుల కళేబరాలు లభ్యమయ్యాయి. వాటిని ఉద్దేశపూర్వకంగా చంపారనడానికి నిదర్శనంగా వాటి తలలు, ఇతర శరీర భాగాలూ నరికి పడేసి ఉన్నాయి. గోహత్యలకు వ్యతిరేకంగా పలు హిందూ సంస్థలు ఆందోళనలు చేపట్టాయి. ఆవుల స్మగ్లింగ్ రాకెట్‌ను పట్టుకోడానికి సివనీ పోలీసులు మహారాష్ట్రలోని నాగపూర్‌కు ప్రత్యేక బృందాలను పంపించారు.
గోవుల హత్యకు సంబంధించి పోలీసులు ఇప్పటికి 12మంది మీద కేసు నమోదు చేసారు, వారిలో ఐదుగురిని అరెస్ట్ చేసారు. వారిని కోర్టు ముందు హాజరుపరిచారు.
సివనీ, దాని పరిసర ప్రాంతాలైన బాలాఘాట్, బేతుల్‌లో చట్టవిరుద్ధమైన గోవధ, ఆవుల స్మగ్లింగ్ విచ్చలవిడిగా జరుగుతాయి. పోలీసు నివేదికల ప్రకారం గత ఆరు నెలల్లో దాదాపు 7వేల ఆవులను అక్రమంగా రవాణా చేస్తుండగా రక్షించారు, సంబంధిత కేసుల్లో వెయ్యిమందికి పైగా అరెస్ట్ అయ్యారు.
మరో సంఘటనలో గత శుక్రవారం నాడు మోరేనా జిల్లా నూరాబాద్‌లోని బెంగాలీ కాలనీలో ఆవులను చంపినందుకు ఐదుగురిపై కేసు పెట్టారు, వారిలో అజ్గర్, రేతువా అనే ఇద్దరిని అరెస్ట్ చేసారు. అదే గ్రామానికి చెందిన అనిపాల్ గుజ్జర్ అనే వ్యక్తి, నిందితులు ఒక ఆవును నరికి చంపడం చూసాడు. దాన్ని అడ్డుకోవాలని ప్రయత్నించినప్పుడు ఐదుగురు నిందితులు అతన్ని చితకబాదారు. దాంతో అనిపాల్ గుజ్జర్ పోలీసులకు ఫిర్యాదు చేసాడు. పోలీసులు అజ్గర్ ఇంటికి వెళ్ళి అక్కడ గోమాంసం, ఎముకలు, తోళ్ళు స్వాధీనం చేసుకున్నారు. ఆ ఘటన బైటపడడంతో స్థానిక హిందూ సంస్థలు ఆందోళన కార్యక్రమం చేపట్టాయి. శనివారం రాస్తారోకో చేసి రహదారులను నిర్బంధించాయి.
ఆ కేసుకు సంబంధించ పోలీసులు తొమ్మండుగురు వ్యక్తులపై కేసులు నమోదు చేసారు. అల్లర్లు, దాడులు చేయడం, ఇతరులను భయభ్రాంతులకు గురిచేయడం అనే ఆరోపణలతో పాటు మధ్యప్రదేశ్ గోవధ వ్యతిరేక చట్టం, జంతుహింస నిరోధక చట్టం, భారతీయ శిక్షాస్మృతి చట్టాలలోని అంశాల ప్రకారం కేసులు రిజిస్టర్ చేసారు. మధ్యప్రదేశ్‌లో గోవధ నేరానికి గరిష్ఠంగా ఏడేళ్ళ వరకూ జైలుశిక్ష విధిస్తారు.