నష్టాలతో ప్రారంభమైన స్టాక్ సూచీలు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల సంకేతాలతో చివరకు లాభాల్లో ముగిశాయి. పెట్టుబడిదారుల నుంచి కొనుగోళ్లకు మద్దతు లభించడంతో ఐసిఐసిఐ, మహీంద్రా అండ్ మహీంద్రా షేర్లు భారీగా పెరిగాయి. నిఫ్టీ 23547 పాయింట్ల ఎగువన ముగిసింది.
ఇవాళ ట్రేడింగ్ ప్రారంభంలో సెన్సెక్స్ 300 పాయింట్లుపైగా నష్టపోయి 76885 పాయింట్ల వద్ద మొదలైంది. ఐరోపా మార్కెట్లు మొదలైన తరవాత అందిన సానుకూల సంకేతాలతో దేశీయ స్టాక్ సూచీలు కోలుకున్నాయి. ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున కొనుగోళ్లు చేశారు. దీంతో చివరకు సెన్సెక్స్ 131 పాయింట్లు పెరిగి 77341 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 46 పాయింట్లు లాభపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ స్వల్పంగా పెరిగి 83.48 వద్ద ముగిసింది.
సెన్సెక్స్ సూచీలో పవర్ గ్రిడ్, నెస్లే ఇండియా, మహింద్రా అండ్ మహింద్రా, సన్ ఫార్మా, అల్ట్రాటెక్ సిమెంట్ షేర్లు లాభాల్లో ముగిశాయి. అదానీ పోర్ట్స్, రిలయన్స్ షేర్లు నష్టాల్లో ముగిశాయి.ముడిచమురు ధరలు స్వల్పంగా తగ్గి బ్యారెల్ 85.58 వద్ద ట్రేడవుతోంది. బంగారం ధరలు ఇవాళ భారీగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు గోల్డ్ 2337 అమెరికా డాలర్ల వద్ద ట్రేడవుతోంది.