ఎయిర్ ఇండియాకు చెందిన ‘కనిష్క’ విమానాన్ని ఖలిస్తానీ ఉగ్రవాదులు పేల్చివేసిన 39వ సంవత్సరం సందర్భంగా కెనడాలో భారత హైకమిషనర్ సంజయ్ కుమార్ వర్మ ఆనాటి దుర్ఘటన మృతులకు నివాళులర్పించారు. ఒట్టావాలోని డోస్ లేక్ దగ్గర కమిషనర్స్ పార్క్‌లోని ఎయిర్ ఇండియా ఫ్లైట్ 182 స్మారకం దగ్గర ఆదివారం నాడు ఆ కార్యక్రమం జరిగింది. కెనడాలోని భారత హైకమిషన్, ఒట్టావాలో వర్షం కురుస్తున్నప్పటికీ, స్మారక కార్యక్రమాన్ని కొనసాగించింది.
ఆ సందర్భంగా హైకమిషనర్ సంజయ్ కుమార్ వర్మ మాట్లాడుతూ, ‘‘ప్రపంచంలో ఏ దేశ ప్రభుత్వమైనా తమ భూభాగం నుంచి జరుగుతున్న ఉగ్రవాద కార్యకలాపాలను తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఉపేక్షించకూడద’’ని చెప్పారు. రాజకీయ ప్రయోజనాల కంటె మానవుల ప్రాణాల విలువ గొప్పదని గుర్తు చేసారు.
39ఏళ్ళ క్రితం 1985 జూన్ 23న కనిష్క విమానాన్ని ఖలిస్తానీ ఉగ్రవాదులు పేల్చివేసిన ఘటనలో 329మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు, వారిలో 86మంది అభంశుభం తెలియని అమాయక పిల్లలు కూడా ఉన్నారు.
ఆ కార్యక్రమంలో కనిష్క దుర్ఘటన బాధిత కుటుంబాల సభ్యులు, స్నేహితులు, కెనడా ప్రభుత్వ అధికారులు, ఇండో కెనడియన్ సమాజానికి చెందిన 150మంది పౌరులు హాజరయ్యారు.
టొరంటోలో జరిగిన నివాళి కార్యక్రమానికి అక్కడి భారత కాన్సుల్ జనరల్ సిద్దార్ధనాథ్ హాజరయ్యారు. మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించారు. హంబర్పార్క్లో ఉన్న కనిష్క స్మారకం దగ్గర నివాళులర్పించారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రపంచదేశాలు కలిసికట్టుగా కృషి చేయవలసిన ఆవశ్యకతను ప్రస్తావించారు. ఉగ్రవాదాన్ని మహోన్నతమైనదిగా కీర్తించే పద్ధతులకు వ్యతిరేకంగా నిలవాల్సిన అవసరాన్ని నొక్కి వక్కాణించారు.
భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ కనిష్క పేల్చివేత ఘటనను ‘ప్రపంచ చరిత్రలో ఉగ్రవాదుల నికృష్ట చర్యల్లో ఒకటి’ అని వ్యాఖ్యానించారు. ఉగ్రవాదాన్ని ఎందుకు సహించకూడదన్న విషయాన్ని గుర్తుచేసే విషాద ఘటన కనిష్క పేల్చివేత అని వివరించారు.
కెనడా పార్లమెంటులో భారత సంతతి ఎంపీ చంద్ర ఆర్య కనిష్క ఘోరానికి కారణమైన సిద్ధాంతం ఇంకా కెనడాలో కొంతమంది ప్రజల్లో సజీవంగా ఉందని ఆవేదన వ్యక్తం చేసారు. ఈ నెల 20న కెనడా పార్లమెంటులో మాట్లాడుతూ ‘భారత మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ హత్యను ఖలిస్తానీ మద్దతుదారులు సమర్ధిస్తూ వేడుక చేసుకోవడం హింసను, ద్వేషభావనలనూ ఘనంగా చాటడమే అన్నారు. ఇటీవల తరచుగా జరుగుతున్న సంఘటనలు కెనడాలోని హిందువులకు ఆందోళన కలిగిస్తున్నాయనీ, చీకటి శక్తులు మళ్ళీ బలం పుంజుకుంటున్నాయనీ చెప్పారు.
ఇటీవల కెనడాలో హత్యకు గురైన ఖలిస్తానీ ఉగ్రవాది నిజ్జర్‌కు ఆ దేశపు పార్లమెంటులో ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో నివాళులర్పించారు. ఆ చర్య ఇప్పటికే బలహీనమైన భారత కెనడా సంబంధాలను మరింత దెబ్బతీసింది. కెనడాలో భారతదేశం దాడులు చేస్తోందనే అర్ధం వచ్చేలా కొద్దికాలం క్రితం ట్రూడో చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఈ సంవత్సరం కనిష్క దుర్ఘటనకు నివాళి కార్యక్రమం ప్రాధాన్యం సంతరించుకుంది.