కొత్త లోక్సభలో 18వ సమావేశాలకు హాజరు కావడం ఆనందంగా ఉందంటూ ప్రధాని మోదీ మీడియాతో చెప్పారు. కొత్త సభ్యులకు ఆయన సాదర స్వాగతం పలికారు. 18వ లోక్సభ సమావేశాలు ప్రారంభమైన వేళ, ప్రధాని మోదీకి కొత్త పార్లమెంట్ భవనం వద్ద సభా వ్యవహారాల మంత్రి కిరణ్ రిజుజు స్వాగతం పలికారు. ప్రధాని మోదీ కాసేపు మీడియాతో ముచ్చటించారు. దేశ ప్రజలు తనకు మూడోసారి సేవ చేసుకునే భాగ్యం కల్పించారని మోదీ ఆనందం వ్యక్తం చేశారు. ప్రజల సహకారంతో 2047నాటికి వికసిత్ భారత్ లక్ష్యంగా పనిచేస్తామని మోదీ స్పష్టం చేశారు.
రేపటికి ఎమర్జెన్సీ విధించి 50 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో జరిగిన తప్పులు మరలా పునరావృతం కాకూడదని మోదీ అభిప్రాయపడ్డారు. ప్రజల మనోభావాలను గౌరవిస్తూ వికసిత్ భారత్ లక్ష్యంగా పనిచేస్తామని చెప్పారు. కొత్త సభ్యులు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాలని ప్రధాని మోదీ సూచించారు.