రష్యాలోని దగెస్తాన్ ప్రాంతంలో గుర్తుతెలియని కొందరు దుండగులు ప్రార్థనాస్థలాలను లక్ష్యంగా చేసుకుని కాల్పులకు పాల్పడ్డారు. ఆ కాల్పులలో కనీసం 15మంది మరణించారు, పలువురికి గాయాలయ్యాయి.
రష్యా ఉత్తర కాకసస్‌లోని దగెస్తాన్ ప్రాంతంలో కొందరు ఆగంతకులు చర్చ్‌లు, సినగాగ్‌లతో (యూదుల ప్రార్థనా స్థలం) పాటు ఒక పోలీస్ పోస్ట్ మీద కాల్పులు జరిపారు.
దగెస్తాన్ ప్రాంతంలోని పెద్ద పట్టణం మకాచ్‌కలా, తీరప్రాంత పట్టణం దెర్బెంట్‌లలో ఈ కాల్పుల సంఘటనలు ఆదివారం సాయంత్రం ఒకే సమయంలో చోటు చేసుకున్నాయి. దెర్బెంట్‌లో సినగాగ్, చర్చ్ రెండింటికీ దుండగులు నిప్పుపెట్టారు.
దగెస్తాన్ గవర్నర్ సెర్గేయ్ మెలికోవ్ వాటిని ‘ఉగ్రవాద దాడులు’గా అభివర్ణించారు. మృతుల్లో ఒక చర్చి ఫాదర్, పలువరు సాధారణ పౌరులు, కొందరు పోలీసులు ఉన్నారని మెలికోవ్ వెల్లడించారు.
‘‘ఈ ఉగ్రవాద దాడుల వెనుక ఎవరి హస్తముందో, వారి లక్ష్యం ఏమిటో మాకు తెలుసు’’ అని మెలికోవ్ టెలిగ్రామ్ సోషల్ మీడియాలో రాసుకొచ్చారు. వారెవరో ఆయన స్పష్టం చేయలేదు, కానీ ఉక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధం గురించే ఆయన ప్రస్తావించారని తెలుస్తోంది.
మకాచ్‌కలా, దెర్బెంట్ పట్టణాల్లో పరిస్థితిని పోలీసులు అదుపులోకి తీసుకొచ్చారని మెలికోవ్ తెలియజేసారు. దుండగులపై పోలీసులు ఎదురుకాల్పులు జరిపారు. పోలీసు కాల్పుల్లో మకాచ్‌కలా పట్టణంలో నలుగురు, దెర్బెంట్‌లో ఇద్దరు దుండగులు హతమయ్యారని మెలికోవ్ వెల్లడించారు.
15మంది మరణానికి సంతాపసూచకంగా సోమ, మంగళ, బుధవారాలు అంటే ఇవాళ్టి నుంచి ఎల్లుండి వరకూ దగెస్తాన్ ప్రాంతంలో శోకదినాలు ప్రకటించారు. ప్రభుత్వ కార్యాలయాలపై జెండాలు సగానికి దించారు. ఆ ప్రాంతంలో వినోద కార్యక్రమాలు అన్నింటినీ రద్దు చేసారు.
రష్యా ఇన్వెస్టిగేటివ్ కమిటీ ఈ ఘటనపై దర్యాప్తు మొదలుపెట్టింది. ఈ సంఘటనకు తామే బాధ్యులమంటూ ఇప్పటివరకూ ఏ సంస్థా ప్రకటించుకోలేదు.
మూడు నెలల క్రితం రష్యా రాజధాని మాస్కోలో ఐసిస్ ఉగ్రవాదుల దాడిలో 145 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. గత కొన్నేళ్ళలో రష్యా ఎదుర్కొన్న అతిపెద్ద దాడి అది. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు జరిగిన దాడి కేవలం దగెస్తాన్ ప్రాంతంలోనే కాక రష్యా అంతటా కలకలం సృష్టించింది.
జగన్‌రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు