ఆంధ్రప్రదేశ్ అక్కడక్కడా కురుస్తున్న వానలు, మరో రెండు రోజులు కొనసాగనున్నాయి. ఈనెల 26 నుంచి మరింత జోరుగా వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. జూన్ 26 నాటికి పశ్చిమ మధ్య బంగాళాఖాతం పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడనుందని, దాని ప్రభావంతో నైరుతి రుతుపవనాలు మరింత చురుకుగా వ్యవహరించనున్నాయి. దీంతో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్నిచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముంది.
మరోవైపు తూర్పు మధ్య బంగాళాఖాతానికి ఆనుకుని ఈశాన్య బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. సోమ, మంగళవారాల్లో అల్లూరి సీతారామరాజు, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో మోస్తరు వానలు, కాకినాడ, కోనసీమ, దక్షిణ, ఉత్తర కోస్తా వ్యాప్తంగా తేలికపాటి వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.