చత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల మరో అరాచకం వెలుగు చూసింది. నకిలీ కరెన్సీ ముద్రించి స్థానిక మార్కెట్లలో మార్పిడి చేస్తోన్నట్లు పోలీసులు గుర్తించారు. చత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో నకిలీ కరెన్సీ ముద్రిస్తోన్న యంత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రూ.50, రూ.100, రూ.200 నోట్లు ముద్రించిన స్థానిక మార్కెట్లలో చలామని చేస్తోన్నట్లు జిల్లా ఎస్పీ కిరణ్ చవాన్ మీడియాకు తెలిపారు.
మావోయిస్టులు వారి అవసరాలు తీర్చుకునేందుకు నకిలీ కరెన్సీ ముద్రణ ద్వారా నిధులు సమకూర్చుకుంటున్నారని సుక్మా ఎస్పీ చవాన్ వెల్లడించారు. నిఘా వర్గాల ద్వారా అందిన సమాచారంతో సీఆర్పీఎఫ్, స్థానిక పోలీసులు జరిపిన దాడిలో ఈ డంప్ బయట పడింది. వేలాది రూపాయల నగదు, ఒక తుపాకీ, నకిలీ కరెన్సీ ముద్రణా యంత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.