నిత్యావసరాల ధరల నియంత్రణకు కేంద్రప్రభుత్వం చర్యలు చేపట్టింది.పప్పు ధాన్యాల నిల్వలపై ఆంక్షలు విధించిన కేంద్రం, తాజా నిబంధనల ప్రకారం టోకు వ్యాపారులు 200 టన్నులు మాత్రమే నిల్వచేసుకోవాలని తెలిపింది. రిటైలర్లు 5 టన్నులు, బిగ్ చైన్ రిటైలర్లు ఒక్కో ఔట్లెట్లో 5 టన్నులు, డిపోలో అయితే 200 టన్నులు,మిల్లర్లు అయితే ఏడాది సామర్ధ్యంలో 25 శాతం లేదా గత మూడు నెలల ఉత్పత్తి మొత్తంలో ఏది ఎక్కువ అయితే దాని మేరకు నిల్వ చేసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.
దిగుమతిదారులు, దిగుమతి చేసుకున్న సరుకును కస్టమ్స్ క్లియరెన్స్ జరిగిన తర్వాత 45 రోజులకు మించి నిల్వ ఉంచరాదని తేల్చి చెప్పింది. కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఎప్పటికప్పుడు దీనిపై పర్యవేక్షణ చేయనుంది.
ఉల్లి ధరల స్థిరీకరణ కోసం ఈ ఏడాది ఐదు లక్షల టన్నులను బఫర్ స్టాక్‌గా ఉంచాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం 71 వేల టన్నుల ఉల్లిని కొనుగోలు చేసింది. దేశంలోని పలుప్రాంతాల్లో రుతు పవనాల పురోగతి కారణంగా ఉల్లి ధరలు తగ్గుతాయని ప్రభుత్వం అంచనా వేసింది.
వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం, దేశంలో శుక్రవారం నాడు కేజీ ఉల్లిపాయల ధర 38.6 గా ఉంది. గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం ఉల్లి పంట దిగుబడి రబీ సీజన్లో 20 శాతం తగ్గవచ్చు అని అంచనా .
గత ఏడాది 302.08 లక్షల టన్నుల దిగుబడితో పోలిస్తే ఈ ఏడాది 254.73 లక్షల టన్నుల పంట మాత్రమే చేతికి వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తోంది. దీంతో ధరలు పెరగకుండా ఉల్లిపాయలను బఫర్‌స్టాక్ గా ఉంచుతున్నారు.