పీజీ వైద్య విద్యలో ప్రవేశానికి దేశ వ్యాప్తంగా నేడు జరగాల్సిన పరీక్షలు వాయిదా పడ్డాయి. నీట్ యూజీ 2024 పరీక్షల్లో అవకతవకలపై దేశ వ్యాప్తంగా ఆందోళన వ్యక్తం అవుతోన్న వేళ నీట్ పీజీ పరీక్షలు వాయిదా పడ్డాయి. నీట్ యూజీ పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్, పేపర్ లీక్ వ్యవహారాలను విచారించేందుకు కేసును సీబీఐకి అప్పగించారు. నీట్ నిర్వహణలో విఫలమైన జాతీయ పరీక్షల సంస్థ (ఎన్‌టీఏ) డైరెక్టర్ జనరల్ సుబోధ్ సింగ్‌ను పదవి నుంచి తప్పించారు. తాజాగా భారత వాణిజ్య ప్రోత్సాహక సంస్థ ఛైర్మన్ ఎండీ ప్రదీప్ సింగ్‌కు ఎన్‌టీఏ బాధ్యతలు అప్పగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.పీజీ వైద్య విద్యలో ప్రవేశానికి నీట్ పీజీ పరీక్షలు రాసేందుకు విద్యార్థులంతా శనివారం సాయంత్రానికి ఆయా నగరాలకు చేరుకున్నారు. అకస్మాత్తుగా పరీక్షలు వాయిదా వేయడంతో వారంతా తిరుగుముఖం పట్టారు. నీట్ యూజీ పరీక్షల నిర్వహణ,ఫలితాలపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతోన్న వేళ నీట్ పీజీ వాయిదా గందరగోళానికి దారితీసింది. దేశ వ్యాప్తంగా శనివారం నిర్వహించిన సీఎస్‌ఐఆర్ పరీక్ష పేపర్ లీక్ కాలేదని కేంద్ర మానవనరుల మంత్రి దర్మేంధ్ర ప్రధాన్ ప్రకటించారు. నీట్ యూజీ పరీక్షల్లో అవకతవకలు వెలికి తీసేందుకు సీబీఐ దర్యాప్తు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు.