వారణాసిలో జ్ఞానవాపి కేసుకు సంబంధించి సర్వే చేపట్టాలని ఉత్తర్వులు జారీ చేసిన అదనపు సెషన్స్ జడ్జి జస్టిస్ రవికుమార్ దివాకర్‌కు భద్రత పెంచాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ముస్లిం వర్గాల నుంచి ఆయనకు బెదిరింపులు వస్తుండడంతో, ఆయన భద్రత గురించి ఆందోళనలు మొదలయ్యాయి.
జూన్ 3న లఖ్‌నవూలోని గోమతీనగర్ పోలీస్ స్టేషన్‌కు చెందిన ఎస్సై ప్రభాకర్ ఓఝా, భోపాల్‌కు చెందిన అద్నాన్ ఖాన్ అనే వ్యక్తిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసారు. ఖాన్‌ను జూన్ 14న ఇంటరాగేట్ చేసారు. అతని దగ్గరనుంచి రెండు మొబైల్ ఫోన్లు, ఒక పెన్‌డ్రైవ్ స్వాధీనం చేసుకున్నారు. ఆ విచారణలో భాగంగా జడ్జి దివాకర్‌ను హత్య చేయడానికి కుట్ర పన్నిన విషయం బైటపడిందని పోలీసులు వెల్లడించారు.
నిందితుడు అద్నాన్ ఖాన్‌కు మతపరమైన విద్వేషాలను, దేశవ్యతిరేక సెంటిమెంట్లను రెచ్చగొట్టే కార్యకలాపాల్లో పాల్గొనేవాడన్న ఆరోపణలున్నాయి. ఇప్పుడు ఏకంగా న్యాయమూర్తినే హత్య చేసే కుట్ర బైటపడింది. ఆ బెదిరింపుల తీవ్రతను గుర్తించిన లఖ్‌నవూ ఎన్ఐఎ ప్రత్యేక న్యాయమూర్తి, రవికుమార్ దివాకర్‌కు భద్రత పెంచాలంటూ జూన్ 20న అలహాబాద్ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌కు లేఖ రాసారు.
రవికుమార్ దివాకర్ గతంవలో వారణాసి సీనియర్ డివిజన్ సివిల్ జడ్జిగా పనిచేసారు. జ్ఞానవాపి కేసులో మసీదు లోపల సర్వే నిర్వహించాలన్న ఆదేశాలు జారీ చేసారు. దానికి గాను ఆయనకు 2022లో బెదిరింపులు వచ్చాయి. ఇస్లామిక్ ఆజాద్ మూవ్మెంట్ అధ్యక్షుడు కషిఫ్ అహ్మద్ సిద్దికీ, ఆయనకు బెదిరింపు లేఖ పంపించాడు. ఆ కేసుకు సంబంధించి హిందూ జడ్జి నిష్పాక్షికమైన నిర్ణయాలు తీసుకుంటారని తాము నమ్మడం లేదని ఆ లేఖలో సిద్దికీ రాసాడు. మసీదును గుడిగా ప్రకటిస్తే దానికి తగిన పరిణామాలను ఎదుర్కోవలసి ఉంటుందని హెచ్చరించాడు.
ఆ లేఖలో సిద్దికీ జడ్జి కుటుంబాన్ని కూడా బెదిరించాడు. న్యాయమూర్తికి ప్రభుత్వం రక్షణ కల్పిస్తే ఆయన భార్య, తల్లి ఎందుకు భయపడాల్సి వస్తుందంటూ పరోక్షంగా హెచ్చరించాడు. రవికుమార్ దివాకర్ హిందూ అతివాద సంస్థల కొమ్ము కాస్తున్నారంటూ ఆ లేఖలో సిద్దికీ ఆరోపించాడు. ఆ లేఖ వచ్చాక తన ప్రాణాలకు అపాయం ఉందని తన తల్లి భయపడుతోందంటూ జడ్జి దివాకర్ ఆందోళన వ్యక్తం చేసారు. తనకు వస్తున్న బెదిరింపుల గురించి ఆయన ఉత్తరప్రదేశ్ డీజీపీ, అదనపు ప్రధాన కార్యదర్శి, వారణాసి పోలీస్ కమిషనర్లకు వెల్లడించారు.