డ్రగ్స్ ముఠా ఉచ్చులో ఏపీకి చెందిన కొందరు వ్యాపారవేత్తలు చిక్కినట్లు పోలీసులు ప్రకటించారు. హైదరాబాద్‌కు చెందిన డ్రగ్స్ సరఫరాదారు సాయిచరణ్‌ను ఇవాళ పోలీసులు అరెస్ట్ చేశారు. బెంగళూరు నుంచి డ్రగ్స్ తీసుకు వచ్చి తెలంగాణ, ఏపీలో కొందరు వ్యాపారులకు సరఫరా చేసినట్లు పోలీసులు గుర్తించారు. బెంగళూరు నుంచి ప్రైవేటు ట్రావెల్స్ ద్వారా డ్రగ్స్ తెప్పించి, వాటిని చిన్న ప్యాకెట్లుగా మార్చి ఏపీ, తెలంగాణలో 50 మంది వ్యాపారులకు పంపినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.
డ్రగ్స్ స్మగ్లర్ సాయిచరణ్ గతంలోనూ జైలుకు వెళ్లి వచ్చాడు. అయినా డ్రగ్స్ స్మగ్లింగ్ మాత్రం మానలేదు. అతని ఖాతాలో విజయవాడ గుంటూరు, విశాఖపట్నం, రాజమండ్రి, హైదరాబాద్ నగరాలకు చెందిన 50 మంది వ్యాపారులున్నట్లు పోలీసులు తెలిపారు. డ్రగ్స్ మూలాలు కనుగొనేందుకు సాయిచరణ్‌ను అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు.