ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ స్వాతి మాలివాల్ పై దాడి కేసులో నిందితుడు బిభవ్ కుమార్ జ్యుడీషియల్ కస్టడీని కోర్టు మరో 14 రోజులు పొడిగించింది.
దిల్లీలోని తీస్ హజారీ కోర్టును ఈ కేసును విచారిస్తోంది. బిభవ్‌కుమార్ కు గతంలో విధించిన జ్యుడీషియల్ కస్టడీ శనివారంతో ముగియడంతో పోలీసులు ఆయనను ఇవాళ మరోసారి తీస్ హజారీ కోర్టులో హాజరుపర్చగా జూలై 6 వరకు కస్టడీని పొడిగించింది.
బిభవ్, స్వాతీ మాలివాల్ పై దాడికి పాల్పడ్డాడన్న ఆరోపణల నేపథ్యంలో ఈ ఏడాది మే నెల 18న పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి నిందితుడిని కొన్ని రోజులపాటు పోలీస్ కస్టడీకి అప్పగించిన తీస్ హజారీ కోర్టు.. ఆ తర్వాత జ్యుడీషియల్ కస్టడీ విధించింది.
లిక్కర్ స్కామ్ లో అరెస్టు అయి ఎన్నికల ప్రచారంకోసం మధ్యంతర బెయిల్‌పై బయటికి వచ్చిన దిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను కలిసేందుకని గత నెలలో స్వాతి మాలివాల్ ఆయన నివాసానికి వెళ్లింది. అయితే అప్పాయింట్మెంట్ లేదన్న కారణంతో అధికారులు ఆమెకు అనుమతి నిరాకరించారు.
దాంతో స్వాతిమాలివాల్ అధికారులతో వాగ్వాదానికి దిగింది. దీనికి సంబంధించి దృశ్యాలు మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఆ సందర్భంగా కేజ్రివాల్ పర్సనల్ సెక్రెటరీ బిభవ్‌కుమార్ తనపై దాడికి పాల్పడ్డాడని స్వాతి మాలివాల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.