పారిస్ ఒలింపిక్స్‌లో షూటింగ్ ఈవెంట్‌లో పాల్గొనబోయే 21 సభ్యుల తుది జట్టులోకి బీజేపీ ఎమ్మెల్యే శ్రేయాసీ సింగ్ ఎంపికయ్యారు. ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్ ఫెడరేషన్ (ఐఎస్ఎస్ఎఫ్), కోటా మార్పిడికి అంగీకరించిన తర్వాత తుది జట్టు ఖరారయింది. అందులో శ్రేయాసీ చోటు దక్కించుకున్నారు.
శ్రేయాసీ సింగ్ 32 ఏళ్ళ ట్రాప్ షూటర్. ఆమెకు 2018లో అర్జున పురస్కారం లభించింది. శ్రేయాసి 2020లో బీజేపీలో చేరారు. అప్పుడు జరిగిన బిహార్ శాసనసభ ఎన్నికల్లో జముయి నియోజకవర్గం నుంచి పోటీచేసి గెలిచి ఎమ్మెల్యే అయ్యారు.
ఒలింపిక్స్ క్రీడల్లో షూటింగ్ జట్టులో కోటా స్పాట్‌ను మార్చుకోడానికి ఐఎస్ఎస్ఎఫ్ అవకాశం కల్పించడంతో భారత జట్టులో శ్రేయాసికి అవకాశం లభించిందని నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ధ్రువీకరించింది. ఇప్పుడు శ్రేయాసి, ఒలింపిక్స్‌లో మహిళల ట్రాప్ ఈవెంట్‌లో రాజేశ్వరీ కుమారితో కలిసి పోటీ పడతారు.
మనూ భాకెర్ ఎయిర్ పిస్టల్, స్పోర్ట్స్ పిస్టల్ రెండు ఈవెంట్లలోనూ విజయాలు సాధించడంతో, భారత జట్టులో మరో మహిళా ట్రాప్ షూటర్‌కు అవకాశం కలిగింది. ఆ స్థానానికి శ్రేయాసి ఎంపికయింది.
‘‘పది మీటర్ల ఎయిర్ పిస్టల్ మహిళల జట్టు నుంచి ఒక కోటా ప్లేస్‌ను ట్రాప్ ఈవెంట్ మహిళల జట్టుకు మార్చాలని మేం ఐఎస్ఎస్ఎఫ్‌ను కోరాము. దానికి వారు ఒప్పుకున్నారు. దాంతో, 20మంది సభ్యుల జాబితాలో శ్రేయాసీ సింగ్‌ను కూడా చేర్చగలిగాం. ఇప్పుడు మహిళల ట్రాప్ ఈవెంట్‌లో మనం ఫుల్ కోటాతో ఆడగలుగుతాం’’ అని ఎన్ఆర్ఏఐ ప్రధాన కార్యదర్శి వెల్లడించారు.
పారిస్ ఒలింపిక్స్ జులై 26 నుంచి ఆగస్ట్ 11 వరకూ జరుగుతాయి. ఇప్పుడు మన షూటింగ్ టీమ్‌లో రైఫిల్ కేటగిరీల్లో 8మంది, పిస్టల్ కేటగిరీల్లో 7గురు, షాట్‌గన్ కేటగిరీల్లో 6గురు క్రీడాకారులు ఉన్నారు. మిక్సెడ్ ఈవెంట్స్‌ను కూడా లెక్కిస్తే మన జట్టుకు పోటీ పడడానికి మొత్తం 28 అవకాశాలున్నాయి. 2012 లండన్‌లో జరిగిన ఒలింపిక్స్‌లో విజయ్‌కుమార్ రజత పతకం, గగన్ నారంగ్ కాంస్యపతకం గెలుచుకున్నారు. అంతకుముందు 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో అభినవ్ బింద్రా స్వర్ణపతకం సాధించి చరిత్ర సృష్టించాడు.