అసోం రాష్ట్రం గువాహటిలోని, చరిత్ర ప్రసిద్ధి కలిగిన కామాఖ్య దేవాలయంలో నేటి నుంచి అంబుబాచి మేళా మొదలైంది. ఈ మేళా కోసం కొద్దిరోజులుగా రాష్ట్రప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.
కామాఖ్యా దేవికి ఏటా బహిష్టు సమయంలో ఆలయాన్ని మూసివేసి జాతర జరపడం ఆ దేవాలయంలో ఆచారం. దాన్నే అంబుబాచి మహోత్సవం అని పిలుస్తారు. ఆ ఉత్సవం కోసం అస్సాం రాష్ట్ర ప్రభుత్వం, కామాఖ్య దేవాలయ నిర్వహణ కమిటీ అన్ని ఏర్పాట్లూ పూర్తి చేసారు. పటిష్ట భద్రత కల్పించారు.
ప్రతీ యేడాదీ నిర్వహించే వార్షికోత్సవం కోసం అన్ని సంబంధిత విభాగాలూ సమన్వయంతో పనిచేసి ఏర్పాట్లు పూర్తి చేసాయని అస్సాం పర్యాటక శాఖ మంత్రి జయంత మల్ల బారువా వెల్లడించారు. ‘‘జూన్ 27న గుడి తలుపులు మళ్ళీ తెరుస్తారు. జూన్ 26, 27 తేదీల్లో దర్శనాలకు ఎలాంటి విఐపి పాసులూ ఉండవు’’ అని వివరించారు.
‘‘ఈ యేడాది అంబుబాచి మేళా జూన్ 22 ఉదయం 8.45కు ప్రవృత్తి (మొదలు) నిర్వర్తిస్తాము, ఆ తర్వాత ఆలయం తలుపులు మూడు పగళ్ళు, మూడు రాత్రులు మూసివేస్తాము. జూన్ 26న మేళా నివృత్తి (ముగింపు) జరుగుతుంది. ఆ రోజు ఉదయం గుడి తలుపులు తెరుస్తాము. ఆ తర్వాతే అన్ని పూజా పునస్కారాలూ మళ్ళీ మొదలవుతాయి. ఈ మేళా సందర్భంగా భద్రత, రవాణా, ఆహారం వంటి అంశాలకు రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం తమ మద్దతు అందజేసాయి’’ అని ఆలయ ప్రధాన పూజారి కవీంద్ర ప్రసాద్ శర్మ చెప్పారు. గతేడాది మేళా సమయంలో సుమారు 25లక్షల మంది ఆలయాన్ని సందర్శించుకున్నారు. ఈ యేడాది అంతకంటె పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారని అంచనా వేస్తున్నామని ఆయన వివరించారు.
కామాఖ్య ఆలయం అస్సాంలోని నీలాచల్ కొండల పైన ఉంది. దేశంలోని 51 శక్తిపీఠాలలో ఇదొకటి. ఇప్పటికీ వామాచార పూజలు జరుగుతుండే కామాఖ్య ఆలయానికి దేశ విదేశాల్లో గొప్ప పేరు ఉంది.