ఆంధ్రప్రదేశ్ 16 వ అసెంబ్లీ తొలి సమావేశాల్లో భాగంగా రెండో రోజు శాసనసభ సమావేశమైంది. తొలి రోజు 172 మంది ఎమ్మెల్యేలు ప్రమాణస్వీకారం చేయగా నేడు మిగిలిన ముగ్గురు ప్రతిజ్ఞ చేశారు. ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆధ్వర్యంలో ప్రమాణస్వీకారం కార్యక్రమం పూర్తి చేశారు. వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు, ఆచంట శాసన సభ్యుడు పితాని సత్యనారాయణ, కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావులు నేడు ప్రమాణస్వీకారం చేశారు.
స్పీకర్ పదవికి అయ్యనపాత్రుడు ఒక్కరే నామినేషన్ వేయడంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు,డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి సత్యకుమార్ యాదవ్, మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు లు అయ్యన్నపాత్రుడును స్పీకర్ స్థానం వద్దకు తోడ్కని వచ్చారు. ఆయనకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ ఎమ్మెల్యేలు పాల్గొనలేదు.
టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీ లో కొనసాగుతున్న నేతల్లో అయ్యన్నపాత్రుడు ఒకరు. 1983 లో మొదటిసారి నర్సీపట్నం నుంచి ఎమ్మెల్యే గా విజయం సాధించిన అయ్యన్నపాత్రుడు, ఏడుసార్లు శాసనసభకు ప్రాతినిధ్యం వహించారు. ఓ మారు లోక్ సభకు ఎన్నికయ్యారు. గత టీడీపీ ప్రభుత్వాల్లో మంత్రిగా పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది.