కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు ఉదయం 9:15 లోగా బయోమెట్రిక్ లో హాజరు పడకపోతే ఆ పూటకు సెలవుగా పరిగణించాల్సి వస్తుందని తేల్చి చెప్పింది. సాయంత్రం 5:30 తర్వాతే ఔట్ పంచ్ వేయాలని ప్రకటించింది. ఈ మేరకు డిపార్ట్ మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ విభాగం ఆదేశాలు జారీ చేసింది.
బయోమెట్రిక్ హాజరు తప్పనిసరి చేస్తూ తాజా ఉత్తర్వుల్లో కేంద్రప్రభుత్వం స్పష్టం చేసింది. ఏదైనా కారణంతో ఆలస్యం జరిగే అవకాశం ఉందనుకుంటే ముందుగానే తనపై అధికారికి సమాచారం అందజేసి ఆ పూటకు క్యాజువల్ లీవ్ కోసం అభ్యర్థించాలని సూచించింది.
కరోనా విజృంభణ సమయంలో వైరస్ భయంతో బయోమెట్రిక్ హాజరుకు స్వస్తి పలికిన ఉద్యోగులు, ఇప్పటికీ చాలా చోట్ల ఉపయోగించడం లేదు. హాజరు కోసం గతంలో లాగే రిజిస్టర్ నిర్వహిస్తున్నారు. దీంతో ఎంత లేట్ గా వచ్చినా ఇన్ టైంలోనే వచ్చినట్లు అందులో నమోదు చేసుకునే అవకాశం ఉంటోందనే ఆరోపణలు ఉన్నాయి.
ఆఫీసు పనిగంటల తర్వాత కూడా తాము విధులు నిర్వహిస్తున్నామని సెలవు రోజుల్లో కూడా ఆఫీసుకు రావాల్సిన అవసరం ఉంటుందని ఉద్యోగులు చెబుతున్నారు. ఉదయం ఆలస్యంగా వచ్చినా సాయంత్రం పూట ఎక్కువ సమయం పనిచేస్తున్నామని ఉద్యోగులు చెబుతున్నారు. కొన్ని సార్లు ఇంటి వద్ద నుంచి కూడా పనిచేస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.