కర్ణాటకలోని రేణుకాస్వామి హత్య కేసులో తవ్వేకొద్దీ సంచలనాలు వెలుగు చూస్తున్నాయి. ఇప్పటికే ఈ కేసులో 17 మందిని బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. 28 మందిని విచారించారు. రూ.39 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. తాజాగా దర్శన్ భార్య పవిత్ర గౌడ, రేణుకాస్వామి మధ్య జరిగిన మెసేజ్ సంభాషణలను పోలీసులు గుర్తించారు. ఇప్పటికే దర్శన్, పవిత్రా గౌడలను జుడీషియల్ రిమాండులో భాగంగా జైల్లో ఉంచారు.
పవిత్ర గౌడ ఆదేశాల మేరకే రేణుకాస్వామి హత్య జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆమె ఆదేశాలను దర్శన్ అమలు చేసినట్లు తెలుస్తోంది. హత్య తరవాత శవాన్ని మాయం చేసేందుకు, ఆనవాళ్లు లేకుండా తుడిపేసేందుకు లక్షల రూపాయల అప్పులు చేసినట్లు పోలీసులు గుర్తించారు. దర్శన్ స్నేహితుడి వద్ద రూ.40 లక్షలు అప్పు తీసుకున్నట్లు తేలింది. ఈ హత్య ఎలా చేశారనేదాన్ని కూడా చిత్రీకరించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. హత్యలో పాల్గొన్న ఓ వ్యక్తి ఫోన్ కనిపించకుండా పోయింది. అది దొరికితే మరిన్ని వివరాలు వెలుగుచూసే అవకాశముందని పోలీసులు చెబుతున్నారు.
ఇప్పటికే జైల్లో ఉన్న పవిత్ర గౌడ, రాత్రి పూట నిద్రపోవడం లేదని, అటు ఇటు తిరుగుతున్నారని జైలర్ తెలిపారు. ఇవాళ ఉదయం టిఫిన్ చేసి, కాఫీ తాగారని చెప్పారు.లగ్జరీ జీవితం నుంచి ఒక్కసారిగా పవిత్ర జైలు జీవితంలోకి మారడంతో ఒత్తిడికి లోనవుతున్నట్లు జైలు అధికారులు చెప్పారు. ఈ కేసులో మరికొంత మందిని అరెస్ట్ చేసేందుకు బెంగళూరు పోలీసులు సిద్దం అవుతున్నారు.