భారతదేశంలో పనిచేస్తున్న చైనా కంపెనీల నిర్వహణలోనూ, దేశంలోకి దిగుమతి చేస్తున్న చైనా ఉత్పత్తుల విషయంలోనూ భారీ అవకతవకలు జరుగుతున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. వీసా డాక్యుమెంటేషన్‌లో తేడాలు, స్థానిక పన్నుల ఎగవేత, హోంశాఖ తనిఖీలను బైపాస్ చేయడం వంటి అవకతవకలు పెద్దస్థాయిలో జరుగుతున్నాయని ప్రభుత్వ వర్గాలు నిర్ధారణకు వచ్చాయి.
2020 కంటె ముందు ప్రవేశపెట్టిన ఇ-వీసా పథకాన్ని చైనా దేశస్తులు విస్తృతంగా దుర్వినియోగం చేసారని భారతీయ నిఘా సంస్థలు, ఆర్ధిక వ్యవహారాల దర్యాప్తు సంస్థలు కనుగొన్నాయి. కొందరు చైనీయులు తమ వీసా గడువు ముగిసిన తరవాత కూడా భారత్‌లో ఉండిపోయారు, అంతేకాదు, సరైన వీసా పొడిగింపు లేకుండా జమ్మూకశ్మీర్, అరుణాచల్ ప్రదేశ్ వంటి సున్నితమైన సరిహద్దు ప్రాంతాలకు సైతం వెళ్ళారు.
మన దేశపు ప్రస్తుత వీసా విధానాన్ని చైనా కంపెనీలు దుర్వినియోగం చేస్తున్నాయని వివిధ మంత్రిత్వ శాఖల అధికారులు వెల్లడించారు. ఉదాహరణకు, కొన్ని కంపెనీలు భారత్‌లో పారిశ్రామిక యూనిట్లు పెట్టడానికి బిజినెస్ వీసాల కోసం దరఖాస్తు చేస్తున్నాయి. నిజానికి అవి ఎంప్లాయ్‌మెంట్ వీసాల కోసం దరఖాస్తు చేయాలి.
మరొక ఆందోళనకరమైన అంశం, బిలియన్ల కొద్దీ డాలర్ల విలువైన చైనీస్ వస్తువుల దిగుమతి. చైనీస్ ఫర్నిచర్, లైట్లు, ఫిక్స్చర్స్, శానిటరీవేర్ వంటివాటిని భారీస్థాయిలో దిగుమతి చేస్తున్నారు. దానివల్ల దేశీయ స్థానిక పరిశ్రమలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. గతంలో చైనీస్ టెలికాం కంపెనీలు భారత మార్కెట్‌ను ముంచెత్తినట్లే ఇప్పుడు కొన్ని చైనీస్ సంస్థలు ‘మేక్ ఇన్ ఇండియా’ పేరిట మనదేశంలో ఉత్పత్తి యూనిట్లు పెడతామంటూ చెబుతున్నాయి. అయితే అవి 80శాతం వస్తువులను చైనా నుంచి దిగుమతి చేస్తున్నాయి.
ఇవి కొత్త విషయాలు కావు. కొన్ని చైనీస్ సంస్థలయితే దాదాపు రెండు దశాబ్దాలుగా భారత్‌లో పనిచేస్తున్నాయి. సరైన ప్రక్రియలో ఫిర్యాదులు నమోదై, వాటిమీద చర్యల ప్రక్రియ మొదలయ్యేవరకూ వాటిపేర్లు బైటపెట్టకూడదని అధికారులు భావిస్తున్నారు.
చైనీస్ ఉత్పత్తుల నాణ్యత గురించిన ఆందోళనలు కూడా ఉన్నాయి. ధరలు తక్కువగా ఉన్నప్పటికీ, చైనీస్ ఉత్పత్తుల నాణ్యత భారతీయ ఉత్పత్తుల కంటె చాలా తక్కువ. 2020 జూన్‌లో గల్వాన్ ఘర్షణల అనంతరం, దిగుమతులకు కొన్ని ప్రమాణాలు ఉండాలని భావించిన కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్స్ జారీ చేయడం మొదలుపెట్టింది.
భారతదేశం 2018లో చైనీస్ కంపెనీలకు 47వేల బిజినెస్ వీసాలు, లక్షన్నర ఇ-వీసాలూ జారీ చేసింది. 2019 నాటికి బిజినెస్ వీసాలు 19వేలకు తగ్గాయి, కానీ ఇ-వీసాలు 2లక్షలకు చేరుకున్నాయి. కోవిడ్ మహమ్మారి తర్వాత వీసాల జారీ ప్రక్రియను ప్రభుత్వం కఠినతరం చేసింది. 2023-24లో చైనా దేశస్తులకు కేవలం 2500 బిజినెస్ వీసాలు, 3000 ఇ-వీసాలు మాత్రమే జారీ చేసింది.
ప్రస్తుతం గమనించిన సమస్యలను పరిష్కరించేవరకూ వీసాల సంఖ్య పెరిగే అవకాశం లేదని అధికారులు సూచించారు. 2017 డోక్లాం ఘటన తర్వాత తూర్పు లద్దాఖ్‌లో గొడవ కూడా వీసాల తగ్గుదలకు ప్రధానమైన కారణమే.
ఢిల్లీ హైకోర్టు ఆదేశాలతో ఎట్టకేలకు రాణా అయ్యూబ్‌పై ఎఫ్ఐఆర్ నమోదు