తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి భక్తులకు అందజేసే లడ్డూ ప్రసాదం నాణ్యత పెంపుపై పోటు కార్మికులతో ఈవో శ్యామలరావు సమీక్ష నిర్వహించారు. నాణ్యమైన నెయ్యి, శెనగపిండి, యాలకులు ఉపయోగించి మరింత రుచికరంగా లడ్డూల శాంపిల్స్ తయారు చేసి నాణ్యతను పరిశీలించాలని ఆదేశించారు.
తిరుమలలోని గోకులం విశ్రాంతి గృహంలో లడ్డూ ప్రసాదం తయారీపై జేఈవో వీరబ్రహ్మం, సీవీఎస్వో నరసింహకిషోర్తో కలిసి సమీక్ష నిర్వహించారు.
లడ్డూ తయారీలో సమస్యలు, నాణ్యతా లోపం పై వస్తున్న విమర్శల గురించి సమావేశంలో ప్రస్తావించారు. పోటు కార్మికుల నుంచి వివరణ కోరారు. లడ్డూల తయారీలో వినియోగిస్తున్న శెనగపిండి, నెయ్యి, యాలకుల నాణ్యతను పెంపొందించాలని చెప్పారు. పని భారం పెరిగినందున అదనపు సిబ్బందిని నియామించాలని కోరారు.
అధికారులు, పోటు కార్మికుల నుంచి సలహాలు, సూచనలు తీసుకున్న ఈవో, నాణ్యమైన నెయ్యి, ఇతర పదార్థాలను ఉపయోగించి రుచికరమైన లడ్డూల శాంపిల్స్ తయారు చేసి రుచి, నాణ్యతను పరిశీలించాలని ఆదేశించారు.
సమావేశంలో డిప్యూటీ ఈవో లోకనాథం, ఏఈవో (పోటు) శ్రీనివాసులు, విశ్రాంత ఏఈవోలు శ్రీనివాసన్, వసంతరావు పాల్గొన్నారు.