కలియుగదైవం శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువైన తిరుమలలో క్యూలైన్లలో వేచి ఉండే భక్తులకు కదంబ ప్రసాదం అందజేస్తున్నారు. గతంలో ఈ విధానం అమలులో ఉన్నప్పటికీ కరోనా కాలంలో నిలిపివేశారు. ఆ తర్వాత పునరుద్ధరించలేదు.
క్యూలైన్లతో పాటు వివిధ కౌంటర్ల వద్ద నిరీక్షించే భక్తులకు పాలు, ప్రసాదం అందజేసేవారు. గత ప్రభుత్వ హయాంలో ఈ విధానాన్ని నిర్లక్ష్యం చేశారు. దీంతో భక్తులు ఇబ్బంది పడ్డారు. ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడటంతో ఈవోగా సీనియర్ ఐఏఎస్ అధికారి శ్యామలరావు బాధ్యతలు చేపట్టారు. టీటీడీ ప్రక్షాళన దిశగా నిర్ణయాలు తీసుకుంటున్నారు.
శ్రీవారి మెట్టు నడక మార్గం ద్వారా వచ్చే భక్తులకు దివ్య దర్శనం టోకెన్ స్కానింగ్ విధానాన్ని టీటీడీ పునఃప్రారంభించింది. శ్రీవారి మెట్టు మార్గంలో 1200వ మెట్టు వద్ద దివ్య దర్శనం టోకెన్ స్కానింగ్ ట్రయల్ రన్ గురువారం నిర్వహించారు.
శ్రీవారి మెట్టు వద్ద దివ్య దర్శనం టోకెన్లు తీసుకున్న భక్తులు విధిగా 1200వ మెట్టు వద్ద స్కానింగ్ చేయించుకోవడం తప్పనసరి. భక్తులు ఈ మార్పును గమనించి తదనుగుణంగా దర్శనానికి రావాలని టీటీడీ కోరుతోంది.