భారత్-చైనా మధ్య పౌరవిమాన సర్వీసులను పునరుద్ధరించాలని పదేపదే చైనా చేస్తున్న విజ్ఞప్తులను భారత్ నిష్కర్షగా త్రోసిపుచ్చింది. చైనా ఎన్నిసార్లు అడిగినా భారత్ వైఖరిలో మార్పు లేదని తాజా అధికారిక ప్రకటనతో మరోసారి వెల్లడైంది. ఇరుదేశాల మధ్యా సరిహద్దు సమస్య పరిష్కారం అయ్యేవరకూ విమాన సర్వీసులను పునరుద్ధరించే ప్రసక్తే లేదని భారత్ తేల్చిచెప్పింది.
2020లో భారత్-చైనా మధ్య సరిహద్దు ఘర్షణలు మరింత ఎక్కువయ్యాయి. హిమాలయాల సరిహద్దుల్లో దశాబ్దాల తరబడి కొనసాగుతున్న సైనిక ఘర్షణలు తారస్థాయికి చేరుకున్నాయి. చైనా అక్రమ దాడుల్లో 20మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. భారత్ ప్రతిదాడుల్లో నలుగురు చైనీస్ సైనికులు మరణించారు. (తమ సైనికుల మరణాల సంఖ్యను చైనా తక్కువ చేసి చెబుతోందన్న వాదన కూడా ఉంది) అప్పటినుంచీ సరిహద్దుల వద్ద ఇరుదేశాలూ గణనీయమైన సంఖ్యలో సైనికులను మోహరించాయి, ఫలితంగా ఉద్రిక్త పరిస్థితులు అలానే కొనసాగుతున్నాయి. ఆ నేపథ్యంలో చైనా-భారత్ మధ్య విమానాల ప్రత్యక్ష రాకపోకలను మన దేశం సస్పెండ్ చేసింది. నాలుగేళ్ళు గడిచిపోయినా భారత్ వైఖరి ఇసుమంతయినా మారలేదు. సరిహద్దు తగాదాలు తేలితే తప్ప భారత్-చైనా బంధంలో స్పష్టత రాదు.
2020నాటి సరిహద్దు ఘర్షణ తర్వాత ఆ ప్రాంతంలో చైనా ప్రభావాన్ని తగ్గించడానికి భారత్ పలు చర్యలు తీసుకుంది. భారత్‌లో చైనీయుల పెట్టుబడులపై ఆంక్షలు, పలు చైనీస్ మొబైల్ యాప్స్ నిషేధం వాటిలో ముఖ్యమైనవి. ప్రస్తుతం సరకు రవాణా విమానాలు ఇరుదేశాల మధ్యా నడుస్తున్నా, పౌరవిమానాలు మాత్రం ఇంకా పునరుద్ధరించలేదు. వాటివల్ల భారీ లాభాలు వస్తాయని తెలిసినా భారత్ దానికి ఒప్పుకోలేదు.
ప్రత్యక్ష ప్రయాణ విమానాల నిలిపివేత రెండుదేశాల ఆర్థిక వ్యవస్థల మీద, ప్రత్యేకించి చైనా మీద, గణనీయమైన ప్రభావం చూపింది. కోవిడ్ 19 మహమ్మారి తర్వాత చైనా అంతర్జాతీయ రవాణా రంగం ఎన్నో సవాళ్ళు ఎదుర్కొంది. భారత్ పౌరవిమానయాన రంగం కోవిడ్ మహమ్మారి తరువాత గణనీయమైన వృద్ధి సాధించింది. చైనా ఓవర్సీస్ ట్రావెల్ రికవరీ మాత్రం మందకొడిగానే ఉంది. రెండు దేశాల మధ్యా విమాన సర్వీసులను పునరుద్ధరిస్తే ఇరుదేశాలకూ ఆర్థికంగా ఎంతో లాభం కలుగుతుంది.
కోవిడ్‌కు ముందు భారత్ చైనా మధ్య నేరుగా ప్రయాణించే విమానాలు డిసెంబర్ 2019లో గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. ఇండిగో, ఎయిర్ ఇండియా, చైనా సదరన్, చైనా ఈస్టర్న్, ఎయిర్ చైనా, షాండాంగ్ ఎయిర్‌లైన్స్ వంటి సంస్థలు మొత్తం 539 సర్వీసులు నడిపేవి. వాటిలో భారత్ 168, చైనా 371 సర్వీసులు నడిపేవి. కోవిడ్ తర్వాత దాదాపు అవన్నీ నిలిచిపోయాయి. భారత్ ఒక యేడాది తర్వాత, చైనా 2023 ప్రారంభంలోనూ అంతర్జాతీయ విమాన సేవలను పునరుద్ధరించాయి.
గతేడాది నుంచీ చైనా, భారత్‌ను ద్వైపాక్షిక విమానసేవల పునరుద్ధరణ గురించి అడుగుతూనే ఉంది. ఇరుదేశాల మధ్యా ప్రత్యక్షంగా విమాన సర్వీసులను పునరుద్ధరించడం చాలా అవసరమని డ్రాగన్ దేశం భావిస్తోంది. ఆ విషయాన్ని చైనా విదేశాంగ శాఖ ఆ విషయాన్ని బహిరంగంగానే ప్రకటించింది. డైరెక్ట్ ఫ్లైట్స్‌ను వీలైనంత త్వరగా ప్రారంభించడం వల్ల ఇరుదేశాలకూ లబ్ధి చేకూరుతుందని చెబుతూ ఆ విషయంలో భారత్ సహకరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది. అయితే భారత్ మాత్రం తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. విమానసేవల సస్పెన్షన్‌ను కొనసాగించాలనే భావిస్తోంది. భారత్ చైనా సరిహద్దుల వద్ద శాంతి, సుస్థిరతకే ప్రాధాన్యమని, అది సాధించిన తర్వాతే చైనాతో ఏ విషయంలోనైనా చర్చలు సాధ్యమనీ స్పష్టం చేసింది.
భారత విదేశాంగ శాఖకు చెందిన ఒక సీనియర్ అధికారి అదే విషయాన్ని తేటతెల్లంగా చెప్పారు. సరిహద్దుల వెంబడి శాంతి నెలకొన్నప్పుడే భారత్ చైనా మధ్య ద్వైపాక్షిక సంబంధాల గురించి ఆలోచించగలమని స్పష్టంగా తేల్చేసారు. ఇండిగో సంస్థ సీఈఓ పీటర్ ఎల్బర్స్, భారత్-చైనా విమాన సర్వీసుల గురించి భారత ప్రభుత్వంతో చర్చలు జరుగుతున్నాయని నిర్ధారించారు. అయితే విదేశాంగ శాఖ, పౌరవిమానయాన శాఖ మాత్రం ఈ అంశంపై నేరుగా స్పందించలేదు.