వైద్య విద్యలో ప్రవేశాలకు నిర్వహించిన నీట్ యూజీ 2024 పరీక్షా ఫలితాల్లో అవకతవకలు జరిగాయని, కౌన్సిలింగ్ నిలిపివేసి, తిరిగి పరీక్షలు నిర్వహించాలంటూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులోని జస్టిస్ విక్రమ్ నాథ్, ఎస్వీఎన్ భట్టిలతో కూడిన వెకేషన్ బెంచ్ స్పందించింది. ఎట్టి పరిస్థితుల్లో కౌన్సిలింగ్ నిలిపేసేది లేదని సర్వోన్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది. నీట్ పరీక్ష నిర్వహించిన నేషనల్ టెస్టింగ్ ఏజన్సీకి సుప్రీంకోర్ట్ నోటీసులు జారీ చేసింది.
ఇప్పటికే దేశ వ్యాప్తంగా నీట్ పరీక్షల్లో అవకతవకలపై ఆందోళనలు జరుగుతున్నాయి. పరీక్షా పేపర్ లీక్ చేసిన 9 మందిని బిహార్ పోలీసులు అరెస్ట్ చేశారు. పేపర్ జవాబులు పొంది, పరీక్షకు హాజరైన విద్యార్థి వాంగ్మూలాలను కూడా పోలీసులు నమోదు చేశారు. మొదటి ర్యాంకు 67 మందికి రావడం, ఒకే క్యాంపస్‌లో పరీక్షలు రాసిన 8 మందికి ఒకే ర్యాంకు రావడం, దాదాపు 15 వందల మందికి గ్రేస్ మార్కులు కేటాయించడంలాంటి వాటిపై వివాదాలు చెలరేగాయి.
దేశ వ్యాప్తంగా అనేక హైకోర్టుల్లో నీట్ రద్దు చేయాలంటూ దాఖలైన అన్ని పిటిషన్లను సుప్రీంకోర్టుకు పంపాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఈ కేసులన్నింటిని కలిపి జులై 8న విచారించనున్నారు.