ఏపీ నూతన డీజీపీగా సీహెచ్ ద్వారకాతిరుమలరావు బాధ్యతలు స్వీకరించారు. ముందుగా ఇవాళ ఉదయం కుటుంబసమేతంగా ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్నారు. ఆ తరవాత మంగళగిరిలోని డీజీపీ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. 1989 బ్యాచ్ ఐపీఎస్ అధికారి ద్వారకాతిరుమలరావు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎస్పీగా, ఐజిగా పనిచేశారు. డీజీపీగా బాధ్యతలు తీసుకున్న ద్వారకాతిరుమలరావుకు పలువురు సీనియర్ ఐపీఎస్ అధికారులు శుభాకాంక్షలు తెలిపారు.
ఏపీలో అత్యంత సీనియర్ ఐపీఎస్ అధికారి ద్వారకాతిరుమలరావు. 1989 బ్యాచ్ ఐపీఎస్ క్యాడర్. కెరీర్ ప్రారంభంలో కామారెడ్డి, ధర్మవరం ఏఎస్పీగా పనిచేశారు. అనంతరం కడప, అనంతపురం, నిజామాబాద్ ఎస్పీగా చేశారు. సైబరాబాద్ కమిషనర్‌గాకూడా సేవలందించారు. రాష్ట్ర విభజన తరవాత విజయవాడ సీపీగా పనిచేశారు. గత కొంతకాలంగా ఆయన ఏపీఎస్ ఆర్టీసీ ఎండీగా చేస్తున్నారు. తాజాగా డీజీపీగా బాధ్యతలు చేపట్టారు.