ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీయే ప్రభుత్వం పాలనా పగ్గాలు చేపట్టడంతో రాజధాని అమరావతి ప్రాంతం మళ్ళీ కొత్త కళను సంతరించుకుంటుంది. రాజధాని నిర్మాణాల విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ వరుస సమీక్షలకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. మూలన పడిన అమరావతి రైల్వే లైన్ ప్రాజెక్టు తెరపైకి వచ్చింది.
అమరావతి ప్రాంత పరిధిలో రైల్వే లైను ప్రతిపాదన ఉండగా, వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అది కార్యరూపం దాల్చలేదు. ప్రస్తుతం టీడీపీ అధికారంలోకి రావడంతో రైల్వేశాఖ స్పందించింది. అమరావతి రైల్వే లైన్ భూసేకరణకు గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది.
ట్రాక్ నిర్మాణానికి రాష్ట్రం వాటా ఇవ్వాలని, భూసేకరణ వ్యయం భరించాలని గతంలో నిబంధనలు పెట్టిన రైల్వే.. ఇప్పుడు బేషరతుగా ప్రకటన జారీ చేసింది. సొంత నిధులతోనే అమరావతికి రైల్వే లైన్ నిర్మించేందుకు సిద్ధమైంది. ఎర్రుపాలెం-అమరావతి-నంబూరు మధ్య భూ సేకరణకు వీలుగా ప్రత్యేక ప్రాజెక్టుగా గుర్తిస్తూ గెజిట్ విడుదల చేసింది.
విజయవాడ-హైదరాబాద్ లైన్లో ఎర్రుపాలెం వద్ద కొత్త లైన్ మొదలై అమరావతి మీదుగా గుంటూరు-విజయవాడ మీదుగా నంబూరు వద్ద కలుస్తుంది.
ఎర్రుపాలెం, పెద్దాపురం, చిన్నారావుపాలెం, గొట్టుముక్కల, పరిటాల, కొత్తపేట, వడ్డమాను, అమరావతి, తాడికొండ, కొప్పురావూరుల్లో 9 స్టేషన్లు నిర్మిస్తారు. ఈ ప్రాజెక్టులో భాగంగా కృష్ణానదిపై కొత్తపేట-వడ్డమాను మధ్య వంతెన నిర్మిస్తారు.