పాకిస్తాన్లో ఒక పర్యాటకుణ్ణి ముస్లిం మూకలు దారుణంగా కాల్చి చంపేసిన సంఘటన గత రాత్రి చోటు చేసుకుంది. దానికి కారణం, ఆ వ్యక్తి కురాన్ను అపవిత్రం చేసాడన్న ఆరోపణలు రావడమే. ఆ సంఘటన ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రొవిన్స్‌లోని స్వాత్ జిల్లా మద్యన్ ప్రాంతంలో జరిగింది.
పోలీసుల కథనం ప్రకారం… పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రొవిన్స్ సియాల్కోట్ జిల్లాకు చెందిన వ్యక్తి స్వాత్ లోయకు పర్యాటకుడిగా వెళ్ళాడు. అతను కురాన్‌లోని కొన్ని పేజీలను తగులబెట్టాడని స్థానికులు ఆరోపించారు. ఆ సాకుతో అతన్ని కాల్చి చంపేసారు.
నిజానికి ఆ వ్యక్తిని స్థానిక పోలీసులు అప్పటికే అరెస్ట్ చేసారు. దైవదూషణ నేరానికి పాల్పడ్డాడన్న కేసు నమోదు చేసారు. ఆ ప్రాంతంలో శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా ఉండడం కోసం నిందితుణ్ణి అరెస్ట్ చేసారు. అయితే, ముస్లిం మూకలు పోలీస్ స్టేషన్ మీదనే దాడి చేసాయి. నిందితుణ్ణి బలవంతంగా లాక్కువెళ్ళి తగలబెట్టి చంపేసారు. ఆ క్రమంలో పోలీస్ స్టేషన్‌కు సైతం నిప్పుపెట్టారు.
స్వాత్ జిల్లా పోలీసు అధికారి డాక్టర్ జహీదుల్లా ఖాన్ డాన్ పత్రికతో మాట్లాడుతూ ‘జనాలు పోలీస్ స్టేషన్‌కు, ఒక మొబైల్ వాహనానికీ నిప్పు పెట్టారు. ఆ దాడిలో 8మంది గాయపడ్డారు’ అని చెప్పారు.
నిందితుణ్ణి ముస్లిం మూకలు పోలీస్ స్టేషన్నుంచి ఈడ్చుకుని బైటకు తీసుకువెళ్ళి అతన్ని చితగ్గొట్టి చంపేసారు. ఆ తర్వాత అతని శవానికి నిప్పుపెట్టి తగలబెట్టేసారు. ఆ సంఘటనను వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేసారు.
ఆ ఘటన తర్వాత మద్యన్ ప్రాంతంలో భారీస్థాయిలో పోలీసు బలగాలను మోహరించారు. పరిస్థితిని అదుపు చేసి, శాంతిభద్రతలను సాధారణస్థాయికి తీసుకురావడానికి పోలీసులు చాలా శ్రమించాల్సి వచ్చింది. జరిగిన సంఘటనపై దర్యాప్తు జరుగుతోందని, ముస్లిం ప్రజలు శాంతియుతంగా ఉండాలనీ ఖైబర్ పఖ్తూన్ఖ్వా ముఖ్యమంత్రి అలీ అమీన్ గండాపూర్ ఒక ప్రకటన విడుదల చేసారు. జరిగిన ఘటనపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఎస్‌డిపిఒ డాక్టర్ జహీదుల్లా ఖాన్‌ను ఆదేశించారు.
గత నెలలో ఇటువంటిదే మరో సంఘటన సియాల్కోట్ జిల్లాలో చోటు చేసుకుంది. పంజాబ్ ప్రొవిన్స్‌లోని సర్గోడా పట్టణంలో ముజాహిద్ కాలనీలో మే నెలలో జరిగింది. నజీర్ మాసీ అనే పెద్దవయసు గల క్రైస్తవుణ్ణి ముస్లిం మూకలు ఎత్తుకుపోయి మూకుమ్మడి దాడి చేసి చంపేసారు. అక్కడితో ఆగకుండా మాసీ ఇంటిపై దాడులు చేసారు, అతని ఫ్యాక్టరీని లూటీ చేసారు. అతన్ని సజీవదహనం చేసారు.
ఆ ఘటన పూర్వాపరాలను మృతుడి మేనల్లుడు తారిక్ సాజిద్ వివరించారు. 24-25 తేదీల మధ్యరాత్రి ఒక పెద్ద గుంపు ఆ ప్రాంతానికి వచ్చింది. వారి హడావుడిలో ఆ ప్రాంతం అంతటినీ ఖరాబు చేసారు. ఆ విషయం గమనించిన పెద్దాయన, వీధులన్నీ శుభ్రం చేసాడు. ఆ క్రమంలోనే చెత్త అంతటినీ ఎత్తి దగ్గరిలోని విద్యుత్ స్తంభం వద్ద పడేసాడు. అయితే ఆ స్తంభం దగ్గర ఒక బుట్ట ఉంది. దాన్నిండా చింపేసిన కురాన్ కాగితాలు ఉన్నాయి. ఆ విషయం తెలీని నజీర్ మాసీ చెత్త అంతా ఎత్తి దానికి నిప్పుపెట్టాడు. ఆ సంఘటనను ఆ దారి మీదుగా వెడుతున్న స్థానికుడొకరు ఒకరు వీడియో తీసారు. మాసీ ఉద్దేశపూర్వకంగా పవిత్ర గ్రంథాన్ని తగులబెట్టాడని భావించి, అతన్ని చంపేసారు. నిజానికి అందులో కురాన్ కాగితాలు ఉన్న సంగతి అతనికి తెలీదని, మాసీ అంటే పడని స్థానిక ముస్లిం మహిళ ఒకరు రచ్చ చేయడంతో స్థానికులు అతన్ని చంపేసారనీ చివరికి తేలింది.