మద్యం విధానంలో అవకతవకల ద్వారా మనీలాండరింగ్‌నకు పాల్పడ్డారంటూ అరెస్టై తిహార్ జైల్లో ఉన్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ గురువారంనాడు ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పుపై ఢిల్లీ హైకోర్టు స్టే ఇచ్చింది. తమ వాదనలు వినేందుకు ట్రయల్ కోర్టులో సరైన అవకాశం లభించలేదని ఈడీ తరపు న్యాయవాదులు ఢిల్లీ హైకోర్టు వెకేషన్ బెంచ్‌లో ఇవాళ పిటిషన్ వేశారు. దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. మరో రెండు రోజుల వరకు ట్రయల్ కోర్టు ఉత్తర్వులపై స్టే విధిస్తూ ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి తీర్పు వెలువరించారు.
లక్ష రూపాయల పూచీకత్తుపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఇవాళ విడుదల కావాల్సి ఉంది. ఢిల్లీ హైకోర్టు స్టే ఉత్తర్వులతో విడుదల నిలిచిపోయింది. ట్రయల్ కోర్టులో తమ వాదనలు వినిపించేందుకు అవకాశం దక్కలేదంటూ ఈడీ తరపు న్యాయవాదుల వాదనలు విన్న ఢిల్లీ హైకోర్టు 48 గంటల వరకు స్టే విధించింది. రాబోయే రెండు రోజుల్లో కేసును విచారించి, తీర్పు వెలువరించనున్నారు.