18వ లోక్‌సభ ప్రోటెం స్పీకర్‌గా బీజేపీ ఎంపీ భర్తృహరి మెహతాబ్‌ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నియమించారు. ఆ విషయాన్ని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరెన్ రిజిజు ఎక్స్ ద్వారా వెల్లడించారు.
కొత్తగా ఎన్నికైన ఎంపీలతో లోక్‌సభలో ప్రమాణం చేయించడానికి, బాధ్యతలు స్వీకరించేలా చేయడానికి ప్రోటెం స్పీకర్ పని చేస్తారు. ఆయనకు సహకరించడానికి సురేష్ కోడికున్నిల్, తళిక్కోట్టై రాజుతేవర్ బాలు, రాధా మోహన్ సింగ్, ఫగన్ సింగ్ కులస్తే, సుదీప్ బందోపాధ్యాయలను నియమించారు.
ప్రభుత్వ నిర్ణయాన్ని కాంగ్రెస్ వ్యతిరేకించింది. పార్లమెంటులో అత్యధిక కాలం ఎంపీగా చేసిన వ్యక్తిని ప్రోటెం స్పీకర్‌గా నియమించడం ఆనవాయితీ అని, ప్రస్తుత లోక్‌సభలో ఎనిమిదవ సారి ఎంపీగా ఎన్నికైన కొడికున్నిల్ సురేష్‌కు (కాంగ్రెస్) ఆ బాధ్యత అప్పగించాలనీ డిమాండ్ చేసింది. బీజేపీకి చెందిన వీరేంద్రకుమార్ కూడా ఎనిమిదోసారి ఎంపీ అయినప్పటికీ ఆయన మంత్రివర్గంలో ఉన్నందున సురేష్‌కే ప్రోటెం స్పీకర్ ఇవ్వాలని కాంగ్రెస్ వాదన.
భారత రాజ్యాంగంలోని 94వ అధికరణం ప్రకారం, కొత్త లోక్‌సభ మొదటి సమావేశం కంటె ముందు స్పీకర్ పదవి ఖాళీ అవుతుంది. కొత్త సభలో కొత్త ఎంపీలతో ప్రమాణం చేయించేందుకు ప్రోటెం స్పీకర్‌ను రాష్ట్రపతి నియమిస్తారు.
18వ లోక్‌సభ మొదటి సమావేశం జూన్ 24న మొదలవుతుంది. రాజ్యసభ సమావేశం జూన్ 27న మొదలవుతుంది.