టీ20 వరల్డ్ కప్ -2024 టోర్నీలో భాగంగా బార్బడోస్లోని కెన్సింగ్టన్ ఓవల్ వేదికగా జరిగిన మ్యాచ్ లో భారత్ ఘన విజయం సాధించింది. ఆఫ్ఘనిస్థాన్ పై 47 పరుగుల తేడాతో గెలిచి సూపర్-8 దశలో శుభారంభం చేసింది.
తొలుత బ్యాటింగ్ చేసిన రోహిత్ సేన నిర్దేశించిన 182 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో అఫ్ఘనిస్తాన్ 134 పరుగులకే కుప్పకూలింది. దీంతో రోహిత్ సేన 47 పరుగుల తేడాతో జయకేతనం ఎగురవేసింది.
టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన భారత్, నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్ (53) రాణించగా, హార్దిక్ పాండ్యా (32) సమయోచితంగా ఆడాడు. కోహ్లీ (24), పంత్(20) పరుగులతో పర్వాలేదనిపించగా.. అక్షర్ పటేల్ 12, శివమ్ దూబే 10, రోహిత్ శర్మ 8 అభిమానులను మరోసారి ఆకట్టుకోలేకపోయారు.
అఫ్ఘనిస్తాన్ బౌలర్లలో సారధి రషీద్ ఖాన్, ఫజల్ హక్ ఫరూఖీ చెరో మూడు వికెట్లు పడగొట్టగా.. నవీనుల్ హక్ ఒక వికెట్ తీశాడు.
లక్ష్యఛేదనలో ఆఫ్ఘన్ ఆదిలోనే చేతులెత్తేసింది. 23 పరుగులకే కీలకమైన మూడు వికెట్లు నష్టపోయింది. గుల్బదీన్ నైబ్, అజ్మతుల్లా కొద్దిసేపు భారత బౌలర్లను దీటుగా ఎదుర్కొని 44 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. ఈ ఇద్దరు ఔట్ కావడంతో మిగతావారు కూడా వరుసగా పెవిలియన్కు చేరుకున్నారు.
బుమ్రా, అర్ష్దీప్ విజృంభించడంతో రషీద్ సేన 20 ఓవర్లలో 134 పరుగులు మాత్రమే చేసింది. దీంతో భారత్ 47 పరుగుల తేడాతో నెగ్గింది.
ఆఫ్ఘన్ బ్యాటర్లలో అజ్మతుల్లా 26 పరుగులు చేయగా జద్రాన్ 19, నైబ్ 17, నబీ 14 రన్స్ చేశారు. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా, అర్ష్దీప్ సింగ్ చెరో మూడు 3 వికెట్లు తీయగా, కుల్దీప్ రెండు , అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా చెరోక వికెట్ పడగొట్టారు.