నీట్ అండర్ గ్రాడ్యుయేట్ పరీక్ష నిర్వహణలో అక్రమాల ఆరోపణలపై కేంద్ర విద్యాశాఖ స్పందించింది. నీట్ పరీక్ష నిర్వహించే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పనితీరు, ఇతర వ్యవహారాలను దర్యాప్తు చేయడానికి ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రకటించారు
‘‘ఎన్‌టిఎకు సంబంధించిన పలు అంశాలపై దర్యాప్తు చేయడానికి ఒక ఉన్నత స్థాయి కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ఎన్‌టిఎ నిర్మాణం, పనితీరు, పరీక్షల నిర్వహణ పద్ధతి, పారదర్శకత, డాటా సెక్యూరిటీ ప్రొటోకాల్ వంటి అంశాలపై ఆ కమిటీ సిఫార్సులు చేస్తుంది’’ అని ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. విద్యార్ధుల ప్రయోజనాలను కాపాడడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, పారదర్శకత విషయంలో రాజీ పడబోమనీ మంత్రి చెప్పారు.
నీట్ పరీక్ష పత్రాలు బిహార్ రాజధాని పట్నాలో లీక్ అయ్యాయన్న ఆరోపణలపై మంత్రి స్పందించారు. ‘‘నీట్ పరీక్షకు సంబంధించినంత వరకూ మేం బిహార్ ప్రభుత్వంతో సంప్రదిస్తున్నాం. పట్నా నుంచి సమాచారం వస్తోంది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వారు సమగ్ర నివేదిక సమర్పిస్తారు. విశ్వసనీయ సమాచారం ఆధారంగా దోషులపై కఠిన చర్యలు తీసుకుంటాం’’ అని ధర్మేంద్ర ప్రధాన్ చెప్పారు.
బిహార్‌లో ప్రశ్నపత్రాల లీకేజీ సంఘటన, నిజాయితీగా పరీక్ష రాసిన లక్షలాది విద్యార్ధుల భవిష్యత్తును ప్రభావితం చేయకూడదని మంత్రి అభిప్రాయపడ్డారు. నీట్ పరీక్షా పత్రంతో సరిపోలిన ప్రశ్నాపత్రమే డార్క్‌నెట్‌లో లభించిందనీ, ఆ విషయం తెలిసిన వెంటనే పరీక్షను రద్దు చేయాలన్న నిర్ణయం తీసుకున్నామనీ మంత్రి చెప్పారు.
నీట్ పరీక్ష పత్రం లీకేజీ వెనుక వ్యవస్థల పతనం ఉందని రాహుల్ గాంధీ ఆరోపించారు. విద్యావ్యవస్థను, విశ్వవిద్యాలయాల్లోని వైస్‌ఛాన్సలర్ పదవులనూ బీజేపీ మాతృసంస్థ ఆర్ఎస్ఎస్ కబ్జా చేసిందనీ, అందువల్లే ప్రశ్నా పత్రాలు లీకయ్యాయనీ ఆయన ఆరోపణలు చేసారు. దానికి ధర్మేంద్ర ప్రధాన్ సమాధానమిచ్చారు. ‘‘మన వ్యవస్థలో నమ్మకం ఉంచాలని ప్రతిపక్ష మిత్రులకు విజ్ఞప్తి చేస్తున్నాను. మా ప్రభుత్వం పారదర్శకతకు నూరుశాతం కట్టుబడి ఉంది. ఎటువంటి తప్పుడు విధానాలనూ సహించే ప్రసక్తే లేదు’’ అని మంత్రి పునరుద్ఘాటించారు.