కెనడాలోని టొరంటో నగరంలో జూన్ 23 మధ్యాహ్నం భారత కాన్సులేట్ జనరల్ ఓ కార్యక్రమం నిర్వహిస్తోంది. 39 ఏళ్ళ క్రితం కెనడాలో ఉగ్రవాదులు కూల్చేసిన భారతీయ విమానం ‘కనిష్క’ దుర్ఘటనలో మృతులకు నివాళులు అర్పిస్తారు. ఆనాటి ఉగ్రవాద చర్యలో 82మంది చిన్నారులు సహా మొత్తం 329మంది ప్రాణాలు కోల్పోయారు.
కెనడా ప్రభుత్వం తమ పౌరుడైన నిజ్జర్ మృతికి సంతాపం ప్రకటిస్తూ తమ పార్లమెంటులో తీర్మానం చేసింది. అతన్ని భారతదేశు ఆదేశాల మేరకు నిఘా సంస్థ (సిబిఐ) అధికారులు తుదముట్టించారని కెనడా ఆరోపణ. అప్పటికే అంతంతమాత్రంగా ఉన్న భారత్-కెనడా సంబంధాలు ఆ పరిణామంతో మరింత దిగజారాయి. తాజాగా, నిజ్జర్‌కు పార్లమెంటులో నివాళులర్పించడం వివాదాన్ని మరింత ముదిరేలా చేసింది.
‘‘ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడడంలో భారత్ ఎప్పుడూ ముందువరుసలోనే ఉంది. ఉగ్రవాదాన్ని గొప్పగా చెప్పడం, దాన్ని సమర్ధించడం వంటి ప్రయత్నాలకు భారత్ ఎప్పుడూ వ్యతిరేకమే. ఎయిర్ ఇండియా విమానం ‘కనిష్క’ను ఉగ్రవాదులు కూల్చేసిన ఘటనకు జూన్ 23, 2024తో 39ఏళ్ళు నిండుతాయి. 329మంది అమాయకుల ప్రాణాలు తీసేసిన ఆ దుశ్చర్య, ప్రపంచ పౌరవిమానయాన రంగంలో అత్యంత దారుణమైన ఉగ్రదాడి. ఆ ఘటనలో బాధితుల కుటుంబాలకు భారత్ ఎప్పుడూ తోడుగా నిలుస్తుంది.
ఈ యేడాది కనిష్క విమాన ఘటనలో అమరులైన వారిని స్మరించుకునే వార్షిక సేవా కార్యక్రమం జూన్ 23 మధ్యాహ్నం 12 నుంచి 1గంట వరకూ టొరంటోలోని క్వీన్స్ పార్క్ సౌత్ లాన్స్‌లో జరుగుతుంది. ఆ కార్యక్రమంలో పాల్గొనడానికి అందరూ ఆహ్వానితులే.’’ అని టొరంటోలోని భారత కాన్సులేట్ జనరల్ ట్వీట్ చేసింది.
1985 జూన్ 23న కెనడా కేంద్రంగా పనిచేస్తున్న ఖలిస్తానీ ఉగ్రవాదులు కెనడా నుంచి భారత్ వస్తున్న ఎయిర్ ఇండియా విమానాన్ని అట్లాంటిక్ మహాసముద్రం మీద ఉండగా పేల్చివేసారు. ప్రముఖ శాస్త్రవేత్త నాయుడమ్మ ఆ దుర్ఘటనలోనే ప్రాణాలు కోల్పోయారు.