నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. దేశ వ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటుతున్న వేళ బిహార్ డిప్యూటీ సీఎం విజయ్ సిన్హా సంచలన వ్యాఖ్యలు చేశారు. నీట్ పేపర్ లీక్ తో ఆర్జేడీ ముఖ్యనేత తేజస్వీ యాదవ్ సన్నిహితుడికి సంబంధం ఉందని ఆరోపించారు. నీట్ పేపర్ లీక్ కేసులో అరెస్టైన యాద్వెంద్, తేజస్వీ పీఏ ప్రీతమ్ కుమార్ కు సమీప బంధువు అని అన్నారు.
యాద్వెందు తన మేనల్లుడి కోసం ఈ కుట్రకు పాల్పడినట్లు తెలిపారు. యాద్వెందు మేనల్లుడైన అనురాగ్ యాదవ్, ఇతరులను పాట్నాలోని ప్రభుత్వ బంగ్లాలో ఉంచడానికి రికమండేషన్ చేసినట్లు చెప్పారు. అభ్యర్థి బస చేసిన గదిలోనే ప్రీతమ్ కూడా బస చేసినట్లు చెప్పారు. తేజస్వీ ఆదేశాల మేరకు పనిచేసే అధికారులపై సమగ్ర దర్యాప్తు చేస్తామన్నారు. ఆర్జేడీ చరిత్ర మొత్తం నేరాలు, అవినీతిమయం అని దుయ్యబట్టారు. నీట్ పేపర్ లీక్ కు సంబంధించి విద్యాశాఖ, బిహార్ పోలీసుల నుంచి వివరణ కోరింది.
UGC-NET నిర్వహణకు త్వరలో కొత్త తేదీ…?
యూజీసీ నెట్ జూన్-2024 పరీక్ష కొత్త తేదీని త్వరలో వెల్లడిస్తామని కేంద్రప్రభుత్వం తెలిపింది. అక్రమాలు జరిగినట్లు నివేదిక అందడంతో ఈ ఏడాది యూజీసీ నెట్ ను కేంద్రప్రభుత్వం రద్దు చేసింది. దీనిపై తాజాగా కేంద్ర విద్యాశాఖ తేదీ మీడియా సమావేశం నిర్వహించారు. పరీక్షపై తమకు ఎలాంటి ఫిర్యాదులు అందలేదని , విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని సుమోటోగా చర్యలు చేపట్టినట్లు విద్యాశాఖ జాయింట్ సెక్రటరీ గోవింద్ జైశ్వాల్ తెలిపారు.
NET నిర్వహణలో అవకతవకలు జరిగాయని, విశ్వసనీయత దెబ్బతిన్నట్లు ఏజెన్సీలు ఇచ్చిన నివేదికతో తమకు అర్ధమైందన్నారు. అందుకే పరీక్షను రద్దు చేసినట్లు వివరించారు. ప్రస్తుతం సీబీఐ దర్యాప్తునకు అప్పగించినందున ఇంతకంటే వివరాలను వెల్లడించలేమన్నారు. బాధ్యులు ఎవరైనా సరే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
జూన్ 18న UGC NET నిర్వహించారు. దీనిని ఎన్టీఏ రెండు షిఫ్టుల్లో నిర్వహించింది. అయితే ఇందులో అక్రమాలు జరిగాయని జాతీయ సైబర్ నేర హెచ్చరికల విశ్లేషణ విభాగం తెలిపింది. దీంతో పరీక్షను రద్దు చేశారు.