బిహార్ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సీఎం నితీశ్ కుమార్ ప్రభుత్వం తీసుకువచ్చిన బీసీ, ఎస్సీ,ఎస్టీలకు 65 శాతం రిజర్వేషన్లను పాట్నా హైకోర్టు కొట్టివేసింది. గత ఏడాది కులగణన జరిపించిన నితీశ్ కుమార్ బీసీ, ఎస్సీ,ఎస్టీల రిజర్వేషన్లను 50 నుంచి 65 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఆర్థికంగా వెనుకబడిన ఈబీసీల రిజర్వేషన్లను కూడా కలుపుకుంటే మొత్తం రిజర్వేషన్లు 75 శాతానికి పెరిగాయి. దీంతో కొందరు కోర్టును ఆశ్రయించారు. దీనిపై ఇవాళ పాట్నా హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది.
విద్య, ఉద్యోగాల్లో బీసీ,ఎస్సీ,ఎస్టీ రిజర్వేషన్లను బిహార్ అసెంబ్లీ తీర్మానంతో 65 శాతానికి పెంచారు. దీని ద్వారా ఎస్సీల రిజర్వేషన్లు 16 నుంచి 20 శాతానికి, ఓబీసీ, ఈబీసీ రిజర్వేషన్లు 30 నుంచి 43 శాతానికి పెరిగాయి. మొత్తం రిజర్వేషన్లు 50 శాతం మించకూడదని సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం పక్కనపెట్టి నితీశ్ కుమార్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో హైకోర్టులో పిటీషన్లు దాఖలయ్యాయి. విచారించిన పాట్నా హైకోర్టు ఇవాళ తీర్పు వెలువరించింది.