మధ్యప్రదేశ్‌లోని పన్నా జిల్లా జనపద్ పంచాయతీలోని లాలర్ గ్రామంలో వందల యేళ్ళ నాటి శిల్పాలు లభించాయి. ఆ శిల్పాల్లో దేవతలు, మహిళలు, చిన్నారులు, జంతువుల బొమ్మలు చెక్కి ఉన్నాయి. అవి పదో శతాబ్దానికి చెందినవి అయి ఉండవచ్చని భావిస్తున్నారు.
లాలర్ గ్రామంలోని శివాలయంలోని ఒక మండపం చుట్టూ ఈ విగ్రహాలు చెక్కి ఉన్నాయి. ఆ శిల్పాల చెక్కడంలో నైపుణ్యం, నిర్మాణంలో వైశిష్ట్యం వాటి చారిత్రక ప్రాధాన్యతను సూచిస్తున్నాయి. గ్రామంలోని పాత మెట్లబావిని కొన్నేళ్ళ క్రితం శుభ్రం చేస్తున్నప్పుడు ఈ శిల్పాలు బైటపడ్డాయని గ్రామంలోని పెద్దలు గుర్తు చేసుకున్నారు. మెట్లబావి ఆ జనపద్ పంచాయతీలో చారిత్రక ప్రాధాన్యం ఉన్న ఒక నిర్మాణం. అందులో బైటపడిన ఈ శిల్పాలను తర్వాతి కాలంలో శివాలయం దగ్గర ఉంచారు. వాటి చారిత్రక ప్రాధాన్యత, వాటి వయసు సంగతి ఎలా ఉన్నా ఆ శిల్పాలు ఎక్కడివి, వాటి సవివరమైన చరిత్ర ఏమిటి అన్నది గ్రామస్తులకు తెలియదు.
గ్రామంలోని ప్రాచీనమైన మెట్లబావిలో ఇంకా మరికొన్ని శిల్పాలు ఉన్నాయని గ్రామస్తులు చెబుతున్నారు. బావి పూర్తిగా ఎండిపోయినప్పుడు ఆ శిల్పాలు కనిపిస్తుంటాయట. వాటికి చారిత్రక ప్రాధాన్యం, సాంస్కృతిక విలువ ఉన్నాయని స్థానిక ప్రజల విశ్వాసం. ఆ శిల్పాల మూలమేమిటో తెలుసుకోవాలన్న కుతూహలం వారిలోనూ ఉంది.
భారత పురావస్తు సర్వేక్షణ సంస్థ – ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఎఎస్ఐ) ఈ శిల్పాల చరిత్ర తెలుసుకోడానికి సర్వే చేయాలి. ఆ మేరకు ఎఎస్ఐ అధికారులకు లేఖ రాసినట్లు పన్నా జిల్లా పంచాయత్ సిఇఒ సంఘప్రియ తెలిపారు. గతంలో చౌముఖ మందిర్ దగ్గర తవ్వకాల్లో కూడా ఇలాంటి విగ్రహాలు దొరికాయని గుర్తు చేసారు. అందువల్ల లాలర్ గ్రామంలో ఎఎస్ఐ సర్వే చేపడితే ఈ శిల్పాల వివరాలు తెలుస్తాయని సంఘప్రియ వివరించారు.