పూరీ శ్రీ క్షేత్రం రత్నభాండాగారం 40 ఏళ్ళ తర్వాత తెరుచుకోనుంది. జులై 8న తెరిచి మరమ్మతులు నిర్వహించేందుకు పురావస్తుశాఖ అనుమతించింది. ఎన్నికల హామీ ప్రకారం ఒడిశాలో బీజేపీ అధికారంలోకి రాగానే జగన్నాథస్వామి నాలుగు ద్వారాలు తెరిచి భక్తులకు ప్రవేశం కల్పించారు.
ప్రభుత్వ ఆదేశాల మేరకు జులైన 8న తలుపులు తెరిచి మరమ్మతుల పురావస్తు శాఖ సూపరింటెండెంట్ డి.బి.గడనాయక్ తెలిపారు. 2019 ఫిబ్రవరి 4న అప్పట్లో ఏర్పాటైన నిపుణుల సంఘం రత్నభాండాగారం లోపలకు వెళ్లేందుకు ప్రయత్నించారు. కానీ తాళం చెవి కనిపించకపోవడంతో ఆ ప్రక్రియ ముందుకు సాగలేదు. బయట నుంచే గోడలు పరిశీలించి నిర్మాణం బలహీనంగా మారినట్లు గుర్తించారు. అదే ఏడాది ఫిబ్రవరి 23న ఏఎస్ఐ అధికారులు లేజర్ స్కానింగ్ చేసి మరోసారి నిర్ధారించారు. మరమ్మతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కోర్‌కమిటీ, టెక్నికల్ కమిటీ నిపుణుల సూచనల మేరకు జరుగుతాయన్నారు.
రత్నభాండాగారం తెరవడానికి ముందుగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంఘం సమావేశమవుతుందని సంపద లెక్కింపు, భద్రతకు సంబంధించి నిర్ణయం జరిగిన తర్వాత మరిన్ని వివరాలు వెల్లడిస్తామని శ్రీక్షేత్ర పాలనాధికారి వీర్ విక్రం యాదవ్ తెలిపారు.
1976లో నందని శత్పథి ప్రభుత్వం రత్నభాండాగారం తెరిచి ఆభరణాల లెక్కించింది. 1984లో జె.బి.పట్నాయక్ సర్కార్ మరోసారి తెరిచి మళ్లీ లెక్కింపు చేపట్టింది. 2000లో అధికారంలోకి వచ్చిన నవీన్ దీనిపై ఆసక్తి చూపలేదు.
పూరీ నీలాద్రి భక్తనివాస్‌లో పూరీ రాజు గజపతి దివ్యసింగ్‌దేవ్ అధ్యక్షతన పాలక వర్గం సమావేశం జరిగింది. . ఈ నెల 22న జగన్నాథ, బలభద్ర, సుభద్ర, సుదర్శనుల దేవస్నానం, జులై 7న జరగనున్న రథయాత్రపై పాలకవర్గ సభ్యులు సమాలోచనలు చేశారు. చతుర్థామూర్తుల చీకటి మందిరంలో రహస్య సేవలు 13 రోజులు మాత్రమే జరగనున్నాయి.