కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. పద్నాలుగు పంటలకు మద్దతు ధర పెంచేందుకు ఆమోదం తెలిపింది. 2024-25 ఖరీఫ్ సీజన్లో వరికి కనీస మద్దతు ధరను 5.35 శాతం పెంచింది. జొన్న, పత్తి, మొక్కజొన్న సహా 13 రకాల పంటల మద్దతు ధరనూ పెంచింది. కేంద్రమంత్రివర్గ నిర్ణయాలను రైల్వే, సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్ వెల్లడించారు..
వరి కనీస మద్దతు ధర రూ.117 పెంచడంతో ధాన్యం క్వింటాల్ ధర రూ. 2,300కు చేరింది. పంటల మద్దతు ధరతో పాటు కేంద్ర మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. మహారాష్ట్రలో విధావన్ వద్ద గ్రీన్ ఫీల్డ్ డీప్ డ్రాఫ్ట్ పోర్టును రూ.76,200 కోట్లతో అభివృద్ధి చేయాలని ఎన్డీయే సర్కార్ నిర్ణయించింది. ఈ ప్రాజెక్టు పూర్తయితే 10 లక్షల మందికి ఉపాధి లభిస్తుంది.
వారణాసిలో అంతర్జాతీయ విమానాశ్రయ కొత్త టెర్మెనల్ నిర్మాణం, రన్వే విస్తరణకు ఆమోదం తెలిపింది. తమిళనాడు, గుజరాత్ లో రూ.7,453 కోట్లతో విండ్ పవర్ ప్రాజెక్టుల నిర్మాణ ప్రతిపాదనలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
కనీస మద్దతు ధర వివరాలు
పంట – ధరలో పెంపు – మద్దతు ధర వివరాలు
వరి (సాధారణం) – రూ.117 – రూ.2,300
వరి (గ్రేడ్-ఎ) – రూ.117 – రూ.2,320
జొన్న (హైబ్రిడ్) – రూ.191 – రూ.3,371
జొన్న (మాల్దండి) – రూ.196 – రూ. 3,421
సజ్జలు – రూ.125 – రూ.2,625
రాగులు – రూ.444 – రూ.4,290
మొక్కజొన్న – రూ.135 – రూ.2,225
వేరుశెనగ – రూ.406 – రూ.6,783
కంది – రూ.550 – రూ.7,550
మినుము – రూ.450 – రూ.7,400
పెసలు – రూ.124 – రూ.8,682
సోయాబీన్ (పసుపు) – రూ. 292 – రూ.4,892
పొద్దుతిరుగుడు విత్తనాలు – రూ.520 – రూ.7,280
నువ్వులు – రూ.632 – రూ.9,267
పత్తి (మధ్యరకం) – రూ. 501 – రూ.7,121
పత్తి (లాంగ్ స్టెపెల్) – రూ.501 – రూ.7,521
నైజర్ విత్తనాలు – రూ.983 – రూ.8,717