తీవ్రమైన ఎండ, వడగాడ్పుల కారణంగా ఈ ఏడాది హజ్ యాత్రికులు పెద్ద సంఖ్యలో చనిపోయారు. దాదాపు 650మంది వరకు మరణించి ఉంటారని అధికారిక వర్గాలు చెబుతున్నాయి. చనిపోయిన వారిలో దాదాపు 90 మంది భారతీయులు ఉన్నారని ఓ దౌత్యాధికారి చెప్పినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెలువడ్డాయి. మరణాలపై సౌదీ అరేబియా, భారత ప్రభుత్వంగానీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
అయిదు రోజుల హజ్ యాత్రలో కనీసం 650 మంది ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యాధికారులు తెలిపారు. జోర్డాన్, టునీసియా వంటి కొన్ని దేశాలు తమ యాత్రికుల మరణాలను ధ్రువీకరించాయి. ఈజిప్టుకు చెందిన 320 మంది యాత్రికులు ప్రాణాలు కోల్పోయారు.
ఈ ఏడాది మొత్తం 18.3 లక్షలమంది హజ్ యాత్రకు వెళ్ళగా ఇందులో 22 దేశాలకు చెందిన యాత్రికులు 16 లక్షల మంది ఉన్నారు. సౌదీ పౌరులు రెండు లక్షల మందికి పైగా ఉన్నారని ఆ దేశ అధికార యంత్రాంగం తెలిపింది.