తమిళనాడులోని కల్లకురిచి జిల్లాలో కల్తీ మద్యం సేవించి 29 మంది ప్రాణాలు కోల్పోయారని జిల్లా కలెక్టర్ ఎంఎస్ ప్రశాంత్ వెల్లడించారు. మరో 60మందికి పైగా ఆస్పత్రుల్లో చేరారు. మృతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదముంది.
మొత్తం 107మంది కల్లకురిచి ప్రభుత్వ ఆస్పత్రిలో చేరారు. వారిలో 59మందిని సేలం, విల్లుపురం, పుదుచ్చేరి వంటి ప్రాంతాలకు తరలించారు. మృతుల్లో 18మంది కల్లకురిచిలోను, మరో 11మంది ఇతర ఆస్పత్రులలోనూ తుదిశ్వాస విడిచారు.
బాధితుల్లో ఎక్కువమంది రోజువారీ కూలీలే. మంగళవారం రాత్రి కల్లకురిచిలోని కరుణాపురంలో ఓ వ్యాపారి వద్ద కల్తీ మద్యం ప్యాకెట్లు కొనుగోలు చేసి తాగారు. తర్వాత తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. తలనొప్పి, వాంతులు, వికారం, కడుపు నొప్పి, కళ్ళమంటలు వంటి లక్షణాలతో ఇబ్బంది పడ్డారు.
ఆ ఘటనకు స్పందనగా తమిళనాడు ప్రభుత్వం బుధవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ శ్రావణ్‌కుమార్ జటావత్‌ను బదిలీ చేసింది. జిల్లా ఎస్‌పి సమయ్‌సింగ్ మీనాను సస్పెండ్ చేసింది. వారి స్థానంలో ఎంఎస్ ప్రశాంత్‌ను కలెక్టర్‌గానూ, రజత్ చతుర్వేదిని ఎస్‌పిగానూ నియమించింది.
ఆ ఘటనకు బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ రాజీనామా చేయాలని అన్నాడిఎంకె ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కె పళనిస్వామి డిమాండ్ చేసారు.
కల్తీమద్యం ఘటనతో దిగ్భ్రాంతి చెందానంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ ఆవేదన వ్యక్తం చేసారు. ఇటువంటి ఘటనలు మళ్ళీ జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.