కంచే చేను మేసింది. బాధితులకు రక్షణగా నివాల్సిన పోలీసు అధికారి, లైంగిక దాడికి దిగిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. తెలంగాణలోని భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ఎస్సై భవానీ సేన్, అదే స్టేషన్లో పనిచేస్తోన్న హెడ్ కానిస్టేబుల్‌పై అత్యాచారం చేశాడు. విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాళేశ్వరం ఎత్తిపోతలకు సమీపంలో నిర్మించిన క్వార్టర్స్‌లో పోలీసులు నివశిస్తున్నారు. కొద్ది రోజుల కిందట ఎస్సై భవానీ సేన్ అర్థరాత్రి సమయంలో హెడ్ కానిస్టేబుల్ ఇంటి కిటికీలు తొలగించి గదిలోకి జొరబడి అత్యాచారానికి దిగాడు. హెడ్ కానిస్టేబుల్ ప్రతిఘటించడంతో తుపాకీ గురిపెట్టి లైంగిక దాడి చేశాడు. హెడ్ కానిస్టేబుల్ తన భర్తకు విషయం చెప్పడంతో పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.
రేంజ్ ఐజీ రంగాథ్, ఎస్సై భవానీ సేన్‌ను శాశ్వతంగా ఉద్యోగం నుంచి తొలగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. 2022లోనూ భవానీసేన్‌పై రేప్ కేసు నమోదైంది. అంతక ముందు కూడా కానిస్టేబుళ్లపై లైంగికదాడి చేసినట్లు కేసులున్నాయి. అతని గత చరిత్రను పరిశీలించిన ఉన్నతాధికారులు ఉద్యోగం నుంచి శాశ్వతంగా తీసివేశారు. భవానీ సేన్‌ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. జుడీషియల్ రిమాండ్ విధించడంతో అతన్ని కరీంనగర్ జైలుకు తరలించారు.