తిరుచానూరులో పద్మావతి అమ్మవారి తెప్పోత్సవాలు కన్నులపండువగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో మూడోరోజైన బుధవారం పద్మావతీదేవి తెప్పపై విహరించి భక్తులను కటాక్షించారు.
ఆలయ అర్చకులు ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చన, నిత్యార్చన నిర్వహించారు. మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు నీరాడ మండపంలో పద్మావతి అమ్మవారికి వేడుకగా అభిషేకం నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్ళు, పసుపు, చందనంలతో విశేషంగా అభిషేకం చేశారు. సాయంత్రం 6.30 గంటల నుంచి తెప్పోత్సవం వైభవంగా జరిగింది. అమ్మవారు పుష్కరిణిలో మూడు సార్లు తెప్పపై విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. ఆ తరువాత పద్మావతి అమ్మవారిని ఆలయం నాలుగు మాడ వీధుల్లో ఊరేగించారు.
ఆ కార్యక్రమంలో తిరుచానూరు పద్మావతీ అమ్మవారి దేవాలయం డిప్యూటీ ఈవో గోవింద రాజన్, సూపరింటెండెంట్ శేషగిరి, ఆలయ అర్చకులు బాబు స్వామి, ఇతర అధికారులు పాల్గొన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పద్మావతీ అమ్మవారి దర్శనం చేసుకున్నారు.
జగన్రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు