లిక్కర్ పాలసీ స్కామ్ విచారణలో భాగంగా దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీని రౌస్ అవెన్యూ కోర్టు పోడిగించింది. ఈడీ అభ్యర్థన మేరకు జులై 3 వరకు కస్టడీని పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
దిల్లీ మద్యం పాలసీ కేసు విచారణలో భాగంగా మార్చి 21న కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్ట్ చేసింది. సార్వత్రిక ఎన్నికల సమయంలో ప్రచారం కోసం మధ్యంతర బెయిల్ పై కొన్ని రోజులు బయట ఉన్నారు. తిరిగి ఈ నెల 2న మళ్లీ జైలుకు వెళ్లి లొంగిపోయారు. తాజాగా కేజ్రీవాల్ కస్టడీని రౌస్ అవెన్యూ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం పొడిగించింది.
కేసు తదుపరి విచారణను జులై 3కు వాయిదా వేసింది.
కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు ఆయన తరఫు న్యాయవాది వ్యతిరేకించారు. ఈడీ దాఖలు చేసిన కస్టడీ పొడిగింపు పిటీషన్ యోగ్యత లేనిదని వాదించారు.
కేజ్రీవాల్‌కు గతంలో విధించిన జ్యుడీషియల్ కస్టడీ నేటితో ముగియడంతో తీహార్ జైలు నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరు పరిచారు.
దిల్లీ లిక్కర్ స్కామ్ లో మరో నిందితుడిగా ఉన్న వినోద్చౌహాన్ కస్టడీని కూడా కోర్టు జులై 3 వరకు పొడిగించింది. లిక్కర్ స్కామ్‌లో ప్రతి అంశం చివరకు కేజ్రీవాల్ తోనే ముడిపడి ఉంటోందని కేంద్ర ప్రభుత్వం తరపున హాజరైన అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు వాదించారు.