అధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ఇప్పటి వరకు 550 మందికి పైగా హజ్ యాత్రికులు చనిపోయినట్లు అరబ్ దౌత్యవేత్తలు తెలిపారు. మరణించిన వారిలో ఎక్కువమంది ఈజిప్ట్ కు చెందినవాళ్లు ఉన్నారని, అధిక వేడి తో అనారోగ్య సమస్యలు తలెత్తి మృతిచెందినట్లు చెప్పారు.
యాత్రికుల రద్దీ కారణంగా ఒక వ్యక్తి తీవ్ర గాయపడి మరణించగా, మిగతా వారు గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో మృతి చెందినట్లు పేర్కొన్నారు. యాత్రికుల మరణాలకు సంబంధించిన వివరాలను మక్కా సమీపంలోని అల్-ముయిసెమ్ ఆస్పత్రిలో పొందిపరిచినట్లు వివరించారు.
జోర్డాన్‌కు చెందినవారు 60 మంది మృతిచెందారు. మొత్తంగా 577 మంది హజ్ యాత్రికులు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారికంగా వెల్లడించారు.
ఎండ వేడికి ఇంత పెద్ద మొత్తంలో మరణాలు చోటుచేసుకోవడం ఇదే మొదటిసారి. హజ్ యాత్రలో దాదాపు 18.3 లక్షల మంది పాల్గొనగా, వారిలో 22 దేశాలకు చెందిన 16 లక్షల మంది ఉన్నారు.
సోమవారం నాడు మక్కాలో 51.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. వాతావరణ మార్పుల వల్ల ప్రతి దశాబ్దానికి 0.4 డిగ్రీ చొప్పున ఉష్ణోగ్రత పెరుగుదల నమోదవటంతో హజ్ యాత్రికులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ప్రతీ దశాబ్దానికి సౌదీ అరేబియాలో 0.4 డిగ్రీల వేడి పెరుగుతుంది. ఈ ఏడాది హజ్ యాత్ర నేటితో (ఈనెల 19బుధవారం) ముగియనుంది. గతేడాది హజ్ యాత్రలో 240కి పైగా ప్రాణాలు కోల్పోయారు.
హజ్ యాత్ర ద్వారా సౌదీ అరేబియా ఏడాదికి 12 బిలియన్ డాలర్ల ఆదాయం లభిస్తోంది. విజన్ 2030 రోడ్‌మ్యాప్‌లో భాగంగా సౌదీ అరేబియా మరో ఆరేళ్ళలో హజ్, ఉమ్రా రెండింటి ద్వారా మతపరమైన పర్యాటకుల సంఖ్యను 30 మిలియన్లకు పెంచాలని భావిస్తోంది. హజ్ ఖర్చు ఒక వ్యక్తికి 3 వేల డాలర్ల నుంచి 10 వేల డాలర్ల మధ్య ఉంటుందని పలు అధ్యయనాల ద్వారా తెలుస్తోంది.