(నేడు జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి – ఛత్రపతి శివాజీ మహారాజ్ పట్టాభిషేక దివసం)
ఛత్రపతి శివాజీ మహారాజ్ పట్టాభిషేక దినాన్ని ‘హిందూ సామ్రాజ్య దినోత్సవం’గా ఎందుకు చేసుకుంటారని చాలామంది అడుగుతూ ఉంటారు. అది తెలవాలంటే శివాజీ పట్టాభిషేకానికి ముందు, తరువాతి చరిత్ర తెలవాలి. మొగలులు, నిజాములు, ఆదిల్‌షాల పాలనలో భారతీయులు, ప్రత్యేకించి హిందువులు ఎదుర్కొన్న అత్యాచారాలను, విధ్వంసాన్నీ ఎవ్వరూ కాదనలేరు. భయంకరమైన ఊచకోతలు, మహిళలపై అత్యాచారాలు, బలవంతపు మతమార్పిడులు, వనరుల దోపిడీ, భూముల ఆక్రమణ, దేవాలయాల ధ్వంసం, సాంస్కృతిక స్థలాల విధ్వంసం, ఇస్లామిక్ షరియా చట్టం అమలు అప్పటి భారతదేశంలో ఎక్కడ చూసినా సర్వసాధారణమైపోయిన దృశ్యాలు. భారతదేశంలో అత్యధికభాగం ఆ దురాక్రమణదారుల చేతిలోకి వెళ్ళిపోయిన సందర్భమది. హిందువులు సమస్తం కోల్పోయారు. తమ సామర్థ్యం, తమ బలం, తమ ధర్మమార్గం… అన్నిటిపైనా నమ్మకం కోల్పోయారు. ఆ సమయంలో వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపగల నాయకుడొకరు కావాలి. అలాంటి నాయకత్వాన్ని ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇవ్వగలిగారు.
ఇంద్రప్రస్థం, కర్ణావతి, దేవగిరి, ఉజ్జయిని, విజయనగరం వంటి హిందూ సామ్రాజ్యాలు పతనమైపోయాయి. దేశంలో స్వతంత్ర హిందూ చక్రవర్తులే లేకుండా పోయారు. ఎంతోమంది హిందూ రాజులు మొగలులు లేదా స్థానిక ముస్లిం పాలకుల దాస్యంలో మగ్గిపోతున్నారు. శివాజీ కంటె ముందు, కర్ణాటకలోని విజయనగర సామ్రాజ్యం ప్రపంచంలోనే అత్యుత్తమ నాగరికత కలిగిన, సంపన్నవంతమైన, వైభవోపేతమైన రాజ్యంగా ఉండేది. హరిహర రాయలు, బుక్కరాయలు అనే సోదరులు స్థాపించిన హిందూ సామ్రాజ్యాన్ని ఆదిల్షా, నిజాంషా, బేరిడ్షా, కుతుబ్‌షా వంటి ముస్లిం సుల్తానులు అందరూ కలిసి కుప్పకూల్చారు. వేలాది వీరులతో కూడిన సైన్యాన్ని హతమార్చారు. బిజాపూర్ సుల్తాను అలీ ఆదిల్షా విజయనగర సామ్రాజ్యపు ఆఖరి రాజు రామరాయల తల నరికి ఆ తలను తన రాజ్యంలోని కాలువ ముఖద్వారంగా అమర్చాడు. నగరంలోని చెత్త అంతా రామరాయల నోటిలోనుంచి ప్రవహించేలా అమర్చి ఆ హిందూ రాజును అవమానించాడు. ఆ సామ్రాజ్య పతనంతో దక్కన్ మొత్తం సుల్తాన్ల కబ్జాలో చిక్కుకుపోయింది.
క్రూరులైన ముస్లిం దురాక్రమణదారులకు తమ సర్వస్వాన్నీ కోల్పోయామన్న సంగతిని హిందువులు అప్పటికి అర్ధం చేసుకున్నారు. తమ స్థితిని మార్చడానికి ఏమీ చేయలేని నిస్సహాయులుగా ఉన్నామని తెలుసుకున్నారు. హిందువులు, వారి అద్భుతమైన సంస్కృతిని రక్షించడానికి ఎవరూ లేని దుస్థితి. అలాంటి సమయంలో సనాతన ధర్మావలంబిగా శివాజీ మహరాజ్ అనే పోరాటయోధుడు ముందుకొచ్చాడు. అతని రాకతో పరిస్థితులు మారాయి. శివాజీ రాజ్యానికి వచ్చాకనే దేశవ్యాప్తంగా హైందవ భావజాలం ప్రజ్వరిల్లింది. తామందరం కలిసికట్టుగా ఉండాలి, దుర్మార్గులైన ఆక్రమణదారులపై కలిసికట్టుగా పోరాడాలి, అప్పుడే తాము పోగొట్టుకున్న అద్భుతమైన ఉజ్వలమైన హైందవ వైభవాన్ని మళ్ళీ పొందగలం అన్న భావన హిందువులలో మళ్ళీ కలిగింది.
‘హిందూ సామ్రాజ్యం’ లక్ష్యం ముస్లిం దురాక్రమణదారుల పాలనను తప్పించుకోవడం, ఘనమైన సంస్కృతి కలిగిన హిందూ సమాజాన్ని పరిరక్షించుకోవడం. హిందూ సంస్కృతి పూర్తిగా నిర్మూలన అయిపోయింది, హిందూ అస్తిత్వం తుడిచిపెట్టుకుపోయింది అన్న దశకు చేరిన తర్వాత సైతం శివాజీ నేతృత్వంలో మరాఠా సామ్రాజ్యం నిలబడింది. బలవంతులైన శత్రువులను సైతం ఓడించి హిందువు నిలబడగలడు, ఛత్రపతిగా సామ్రాజ్యాన్ని పరిపాలించగలడు అని శివాజీ నిరూపించాడు.
శివాజీ పట్టాభిషేకంతో… ప్రపంచంలోనే అత్యంత ప్రాచీనమూ, నాగరికమూ అయిన హిందూ సంస్కృతి గొప్పదనాన్ని మనం గ్రహించగలిగాం. శివాజీ మహారాజ్ స్థాపించిన సామ్రాజ్యపు లక్ష్యం దాదాపు నెరవేరింది. ముస్లిం దురాక్రమణ దారుల పాలనను అంతంచేసి, హిందూ సమాజాన్ని పరిరక్షించుకోవడమే ఆ లక్ష్యం. అంతేకాదు, భవిష్యత్ తరాలకు శివాజీ ఒక ఆదర్శాన్ని సాధించి చూపించాడు. అసాధ్యంగా కనిపించే ఎలాంటి లక్ష్యాన్నయినా సాధించడం సాధ్యమే అని నిరూపించాడు. ఛత్రపతి శివాజీ మహారాజ్ ప్రకటించిన ‘హిందూ స్వరాజ్య’ నిజమైన అర్ధం ‘ఏదీ అసాధ్యం కాదు’ అనే. భారత చరిత్రను ఇస్లామీకరించే ప్రయత్నాన్ని తిరగరాసింది శివాజీ పరిపాలన. ప్రపంచ చరిత్రలోనే దానికి సాటివచ్చే ఉదాహరణ మరొకటి లేదు. ఆ చారిత్రక పాఠం మన భవిష్యత్తుకు అమూల్యమైన గుణపాఠం.
విదేశీ ముష్కరుల దురాక్రమణ ఫలితంగా మన భాష సైతం పాడైపోయింది. పర్షియన్, అరబిక్ భాషల నుంచి ఎన్నో పదాలు మరాఠీలోకి వచ్చిచేరిపోయాయి. ఒకదశలో మరాఠీ భాష అంతరించిపోయే ప్రమాదానికి చేరింది. దాంతో మరాఠీ భాషలోని పర్షియన్, అరబిక్ పదాలను సంస్కృత పదాలతో మార్చివేయడానికి శివాజీ నిశ్చయించాడు. ఆ పనిని రఘునాథ్ హన్మంతే, ధూండీరాజ్ లక్ష్మణ్ వ్యాస్ అనే ఇద్దరు విద్వాంసులకు అప్పగించాడు. మొత్తం 1380 పర్షియన్ పదాలను తొలగించి సంస్కృత పదాలను సమకూర్చారు. ‘రాజ వ్యవహార కోశం’ అనే నిఘంటువును అభివృద్ధి చేసారు.
శివాజీ సంస్కృత భాష ఆధారంగా తన సొంత ముద్రను తయారు చేసుకున్నాడు. స్వరాజ్యం సాధించిన వెంటనే శివరాజు పేరుతో ముద్ర తయారైంది. అంతకుముందరి రాజుల ముద్రలు పర్షియన్లో ఉంటే శివాజీ మహారాజ్ ముద్ర సంస్కృతంలో రూపొందింది. అది అసలైన సార్వభౌమత్వానికి చిహ్నం, శివాజీ పరిపాలనపై హిందూ సంస్కృతి ప్రభావానికి నిదర్శనం.
శివాజీ ముద్ర మీద ‘‘ప్రతిపచ్చంద్రలేఖేవ వర్ధిష్ణుర్విశ్వవందితా సాహసునోః శివస్యైషా ముద్రా భద్రాయ రాజతే’’ అని ఉండేది. ‘‘శివాజీ పాడ్యమి నాటి చంద్రుడిలా క్రమంగా పెరుగుతాడు, ప్రపంచమంతా అతనికి నమస్కరిస్తుంది. శహాజీ పుత్రుడైన శివాజీకి చెందిన ఈ ముద్ర ప్రజాసంక్షేమానికి చిహ్నం’’ అని దాని అర్ధం. శివాజీ లక్ష్యం ఆ ముద్రతో స్పష్టమవుతుంది. అంతేకాదు, అతని వినయం కూడా ‘మర్యాదయం విరాజతే’ అనే వాక్యంతో తెలుస్తుంది.
శివాజీ మహరాజ్ సైన్యం బలం చాలా గొప్పది. 1648లో ఫత్తేఖానాపై దాడి, శివాజీ సైన్యం చేసిన మొదటి ప్రధానమైన దాడి. అప్పుడు శివాజీ సైన్యం కేవలం సుమారు 12వందల మంది మావళుల సైన్యం మాత్రమే. అక్కడ మొదలుపెట్టి 32 సంవత్సరాల పాటు శివాజీ ఎన్నో కోటలు నిర్మించాడు. సుపరిపాలన తీసుకొచ్చాడు. లక్షమందితో పదాతి దళాన్ని, లక్ష గుర్రాలతో ఆశ్విక దళాన్నీ నిర్మించాడు. అద్భుతమైన ఆయుధాలు ఆయన సొంతం. కోటల రక్షణ కోసం 175,000, మొగలులపై పోరాటానికి 125,000 నగదును నిర్వహించాడు.
ఛత్రపతి శివాజీమహారాజ్ హిందువుల ఆత్మగౌరవాన్నీ, సంస్కృతినీ పునరుద్ధరించాడు. విదేశీ దురాక్రమణదారులు దాడులు చేసినప్పుడు వారు ఆలయాలను, ఆశ్రమాలనూ ధ్వంసం చేసి హిందూ సమాజాన్ని తుడిచిపెట్టేసే ప్రయత్నం చేసారు. అయోధ్యలో శ్రీరామజన్మభూమి మందిరాన్ని బాబర్ ధ్వంసం చేయడం, వారణాసిలో కాశీ విశ్వనాథుడి మందిరాన్ని, మథురలో కృష్ణజన్మస్థాన ఆలయాన్నీ ఔరంగజేబు ధ్వంసం చేయడం దానికి ఉదాహరణలు. అలా మందిరాలు కూలగొట్టి వాటి స్థానంలో ముస్లిం దురాక్రమణదారులు చేపట్టిన నిర్మాణాలు నేటికీ మన ఆత్మగౌరవాన్ని కించపరుస్తూనే ఉన్నాయి. ప్రముఖ చరిత్రకారుడు ఆర్నాల్డ్ టాయన్బీ 1960లో ఢిల్లీలో ఒక ప్రసంగంలో ఇలా చెప్పాడు. ‘‘మీ దేశంలో ఔరంగజేబు నిర్మించిన మసీదులు మిమ్మల్ని ఎంతగానో అవమానించేవిగా ఉన్నప్పటికీ మీరు వాటిని ఇంకా పరిరక్షిస్తూనే ఉన్నారు’’. 19వ శతాబ్దం ప్రథమార్థంలో రష్యా పోలండ్‌ను ఆక్రమించినప్పుడు తమ విజయాన్ని ప్రకటించేందుకు వార్సా నగరం నడిబొడ్డున రష్యన్ ఆర్థడాక్స్ చర్చ్ నిర్మించారు. మొదటి ప్రపంచయుద్ధంలో పోలండ్ మళ్ళీ స్వతంత్రం సాధించాక ఆ దేశం మొట్టమొదట చేసిన పని, రష్యా నిర్మించిన చర్చిలను నిర్మూలించడం, రష్యా ఆధిక్యానికి సూచికలుగా నిలిచిన అవశేషాలను ధ్వంసం చేయడం.
నిజానికి ఛత్రపతి శివాజీ మహారాజ్ కూడా ఆ పని మొదలుపెట్టాడు, గోవాలోని సప్తకోటేశ్వర దేవాలయం, ఆంధ్రప్రదేశ్‌లో శ్రీశైలం దేవాలయం, తమిళనాడులోని సముద్రత్తిర్ పెరుమాళ్ దేవాలయాలను పునరుద్ధరించాడు. తన చర్యల ద్వారా శివాజీ ముస్లిం దురాక్రమణదారులకు ఇచ్చిన సందేశం చాలా స్పష్టంగా ఉంది, ‘‘మీరు మా ఆలయాలను ధ్వంసం చేసి, మా సంస్కృతిని అవమానించి, మా ఆత్మగౌరవానికి హాని కలిగిస్తే, వాటిని మేం మరింత దృఢంగా నిర్మించుకుంటాం’’.
శివాజీ కొన్నిచోట్ల మసీదులను సైతం ధ్వంసం చేసాడు. కవీంద్ర పరమానంద్ గోవింద్ నేవాస్కర్ రచించిన శివభారతం 18వ అధ్యాయం, 52వ శ్లోకంలో కళ్యాణ్-భివాండీ దగ్గర మసీదును శివాజీ ధ్వంసం చేసిన సంగతి ప్రస్తావించారు. 1678లో జెస్యూట్ మతగురువు ఆంద్రె ఫెయిర్ రాసిన ఒక లేఖలో శివాజీ ముస్లిముల మసీదులను ధ్వంసం చేసాడని రాసిఉంది.
ఏ దేశం నుంచయినా దాని సంస్కృతినీ ధర్మాన్నీ తొలగించడం సాధ్యం కాదు. ఆత్మగౌరవాన్ని తొలగించడం అసాధ్యం. ఛత్రపతి శివాజీ మహారాజ్ మనకు నేర్పించింది ఏంటంటే, విదేశీ దురాక్రమణదారులు మన ఆత్మగౌరవం మీద దాడి చేస్తే, మనం కచ్చితంగా స్పందించాలి. ఆ బానిసత్వపు మరకలను తుడిచివేయాలి. మన ఆత్మగౌరవాన్ని పునరుద్ధరించుకోవాలి.
‘‘శివాజీ మహారాజ్ మనకు ఆదర్శం. హిందూ ధర్మాన్ని పరిరక్షించడానికి తను చేసిన కృషి వల్లనే ఆయన మనకు ఎప్పటికీ గుర్తుండిపోతారు. కాషాయధ్వజానికి ఉన్నంత శక్తి శివాజీ మహారాజ్‌కు ఉంది. కాషాయ ధ్వజాన్ని చూసి చరిత్రను గుర్తు చేసుకుని స్ఫూర్తిని పొందే ప్రతీ ఒక్కరికీ శివాజీ మహారాజ్ స్ఫూర్తి. ధూళిలో పతనమైపోయిన హిందూ కాషాయ ధ్వజాన్ని పునరుద్ధరించి పునరుజ్జీవింపజేసినవాడు, అవసానదశకు చేరుకున్న హిందూధర్మానికి కొత్తజీవాన్ని ఇచ్చినవాడు ఛత్రపతి శివాజీ మహారాజ్. కాబట్టి మీకు ఎవరైనా ఆదర్శప్రాయుడు కావాలంటే శివాజీని మించినవారు లేరు’’ అన్నారు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ వ్యవస్థాపకులు డాక్టర్ కేశవ బలీరాం హెడగేవార్.
ఎందరో భారతీయ, విదేశీ చరిత్రకారులు… ప్రత్యేకించి కమ్యూనిస్టులు శివాజీ మహారాజ్ ఘనతను అప్రతిష్ఠపాలు చేయడానికి పనిగట్టుకుని ప్రయత్నించారు. డబ్బు కోసమో, పేరు కోసమో లేక తమ సిద్ధాంతాలను నిలబెట్టుకోవడం కోసమో శివాజీ మహారాజ్‌ను దూషించారు. కానీ శివాజీ మహారాజ్ లక్షలాది ప్రజలను విదేశీ దురాక్రమణదారుల దారుణమైన దాడుల నుంచి రక్షించిన మహానుభావుడు, గొప్పదైన భారతీయ సంస్కృతిని పరిరక్షించడానికి రామరాజ్యాన్ని పునఃప్రతిష్ఠించిన మహానాయకుడు.