అన్నూకపూర్ ప్రధానపాత్ర పోషించిన ‘హమారే బారహ్’ సినిమా విడుదలకు మార్గం సుగమమైంది. చిత్రం యూనిట్ సినిమాలో మూడు మార్పులు చేయడానికి అంగీకరించారు. దాంతో సినిమాను జూన్ 21న విడుదల చేసుకోడానికి బొంబాయి హైకోర్టు అనుమతినిచ్చింది.
సినిమాను పూర్తిగా సమీక్షించిన న్యాయస్థానం ఆ చిత్రంలో కురాన్కు కానీ, ముస్లిములకు కానీ అభ్యంతరకరమైన అంశాలేవీ లేవని తేల్చింది. పైగా ఆ చిత్రం మహిళల అభ్యున్నతే లక్ష్యంగా రూపొందించారని గమనించింది.
సినిమాలో మూడు డైలాగులను మ్యూట్ చేసారని, అభ్యంతరకరంగా భావించిన సన్నివేశాలను తొలగించారనీ కోర్టు వెల్లడించింది. ఇతరుల మనోభావాలను దెబ్బతీసేలాంటి సన్నివేశాలేమీ లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
ఉదాహరణకి, ఒక సన్నివేశంలో ఒక పాత్ర అల్లా పేరు తలచుకుంటూ తన కూతురిని చంపేస్తానంటాడు. ఆ సన్నివేశం సమస్యాత్మకం కావచ్చని, ఆ వాక్యాన్ని తీసివేసినంత మాత్రాన చిత్రరూపకర్తల సృజనాత్మక స్వేచ్ఛకు భంగకరం కాదనీ కోర్టు సూచించింది.
జస్టిస్ బిపి కొలాబావాలా, ఫిర్దోస్ పూనివాలాలతో కూడిన డివిజన్ బెంచ్, ఆ సినిమా ప్రేక్షకులను ఆలోచింపజేసే సినిమా తప్ప మతిలేని వినోదాత్మక చిత్రం కాదని వ్యాఖ్యానించింది. ‘‘ఈ చిత్రం నిజానికి మహిళల ఉద్ధరణకు సంబంధించినది. ఈ సినిమాలో ఒక మౌలానా కురాన్ను తప్పుగా వ్యాఖ్యానిస్తే, మరొక ముస్లిం వ్యక్తి దానికి అభ్యంతరం తెలిపే దృశ్యం ఉంది. అంటే ప్రజలు తమ బుద్ధిని వాడాలి తప్ప అలా తప్పుదోవ పట్టించే మౌలానాలను గుడ్డిగా అనుసరించకూడదు అన్న సందేశాన్నిస్తోంది’’ అని న్యాయస్థానం పేర్కొంది.
చిత్రానికి వ్యతిరేకంగా పిటిషన్ వేసిన వారు ఆ సినిమాలో ముస్లిములకు అవమానకరమైన సన్నివేశాలున్నాయనీ, ఇస్లామిక్ బోధనలను వక్రీకరించారనీ ఆరోపించారు. ఆ ఆరోపణల కారణంగా సినిమా విడుదల వాయిదా పడింది. అయితే సిబిఎఫ్సి సూచనల మేరకు అభ్యంతరకర సన్నివేశాలను తొలగించిన తర్వాత సినిమాను న్యాయస్థానం సమీక్షించింది. ఆ సినిమాపై నిషేధం కొనసాగించవలసిన అవసరం లేదని కోర్టు నిర్ధారణకు వచ్చింది.
అయితే సినిమా సర్టిఫికేషన్ కంటె ముందే ట్రయిలర్ విడుదల చేయడం వల్ల వివాదం ఏర్పడిందని హైకోర్టు భావించింది. ఆ మేరకు జరిమానా విధించింది. ఆ మొత్తాన్ని పిటిషనర్ సూచించే స్వచ్ఛంద సంస్థకు విరాళంగా ఇవ్వాలని ఆదేశించింది. ఈ వివాదం వల్ల సినిమాకు ఖర్చు పెట్టక్కర్లేకుండానే ప్రచారం జరిగిందని వ్యాఖ్యానించింది.
‘‘ఈ సినిమాలో హింసను ప్రేరేపించే సన్నివేశాలు ఏమీ లేవు. అలాంటివేమైనా ఉంటే మేమే ముందు అభ్యంతరం వ్యక్తం చేసేవాళ్ళం. భారతీయ ప్రజలు అంత మూర్ఖులు, అవివేకులూ కారు’’ అని కోర్టు వ్యాఖ్యానించింది.