‘అగ్ని జ్వాలలు పుస్తకాలను కాల్చగలవు, జ్ఞానాన్ని మాత్రం కాదు’ అని నలంద విశ్వవిద్యాలయం కొత్త క్యాంపస్ ప్రారంభోత్సవ సభలో ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. బిహార్‌లో పర్యటించిన ప్రధాని మోదీ నలంద విశ్వవిద్యాలయంలోని నూతన ప్రాంగణాన్ని ప్రారంభించి ప్రసంగించారు. నలందకు ఆసియాలోని అనేక దేశాల వారసత్వంతో అనుబంధం ఉందన్నారు.
నలంద విశ్వవిద్యాలయ పునర్నిర్మాణంలో మన భాగస్వామ్య దేశాలు కూడా పాలుపంచుకున్నాయన్న మోదీ, కొత్త క్యాంపస్ భారతదేశ శక్తిసామర్థ్యాలను ప్రపంచానికి పరిచయం చేస్తుందని ఆకాంక్షించారు. బలమైన మానవ విలువలపై నిలబడే దేశం భారత్ అని కొనియాడారు. చరిత్రను పునరుద్ధరించడం ద్వారా మెరుగైన భవిష్యత్తుకు పునాది వేయడం భారతీయులకు తెలుసన్నారు. ‘‘నలంద అంటే గుర్తింపు, గౌరవం, విలువ, మంత్రం, ఒక అమోఘ కథ… నలంద అనంత సత్యానికి నిదర్శనం.’’ అని పేర్కొన్న ప్రధాని మోదీ, పుస్తకాలు అగ్ని జ్వాలల్లో కాలిపోవచ్చు, కానీ అవే అగ్ని జ్వాలలు జ్ఞానాన్ని నాశనం చేయలేవన్నారు.
సభలో పాల్గొన్న బిహార్ సీఎం నితీష్ కుమార్, ప్రధాని మోదీ ఆశీస్సులతో నలంద యూనివర్శిటీ క్యాంపస్ ను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. 2006లో అప్పటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం బిహార్ వచ్చినప్పుడు నలంద యూనివర్శిటీని పునఃస్థాపన గురించి ప్రస్తావించినట్లు తెలిపారు.