ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మంత్రివర్గ సమావేశం ఈ నెల 24న జరగనుంది. వెలగపూడిలోని సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఉదయం 10 గంటలకు కేబినెట్ మీటింగ్ జరగనుంది. మంత్రివర్గ సమావేశంలో చర్చించాల్సిన అంశాలపై ప్రతిపాదనలు పంపాలని అన్ని ప్రభుత్వ శాఖలకు ఆదేశాలు వెళ్లాయి. 21వ తేదీ సాయంత్రం నాలుగు గంటల్లోపు ప్రతిపాదనలు పంపాలని ఆదేశాల్లో స్పష్టం చేశారు.
ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం, స్పీకర్, డిప్యూటీ స్పీకర్ కోసం ఈ నెల 21,22 తేదీల్లో అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన పయ్యావుల కేశవ్, అసెంబ్లీ సమావేశాల నిర్వహణ ఫైలు పై తొలి సంతకం చేశారు.
ప్రొటెం స్పీకర్ గా గోరంట్ల బుచ్చయ్య చౌదరి వ్యవహరించనున్నారు. ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం తర్వాత స్పీకర్ ఎన్నిక జరగనుంది. మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు స్పీకర్ గా బాధ్యతలు చేపట్టనున్నారు.