కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి కొలువుదీరిన తిరుమలలో స్వామి దర్శనానికి భక్తులు పెద్దఎత్తున తరలివస్తున్నారు. శ్రీవారి దర్శనానికి 20 గంటల సమయం పడుతుండగా ఉచిత సర్వ దర్శనానికి అన్ని కంపార్ట్ మెంట్లు నిండాయి.. టైమ్ స్లాట్ ఎస్‌ఎస్‌డి దర్శనానికి ఐదు గంటల సమయం పడుతుండగా రూ.300 ప్రత్యేక దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది.
తిరుమలలో నేటి నుంచి ఈ నెల 21 వరకు జ్యేష్ఠాభిషేకం జరుగనుంది. దీంతో జూన్ 21 వరకు ఆలయంలో కళ్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది. తోమాల, అర్చన సేవలను ఏకాంతంగా నిర్వహించనున్నారు.
అభిషేకం, స్నపన తిరుమంజనాల కారణంగా శ్రీదేవి, భూదేవి, శ్రీ మలయప్పస్వామివార్ల ఉత్సవమూర్తులు అరిగిపోకుండా జాగ్రత్తలు తీసుకునేందుకు శాస్త్రోక్తండా నిర్వహించే ఉత్సవమే జ్యేష్ఠాభిషేకం. ప్రతీ ఏడాది జ్యేష్ఠ మాసంలో జ్యేష్ఠా నక్షత్రానికి ముగిసే విధంగా స్వామివారికి ఈ ఉత్సవం నిర్వహిస్తారు. సంపంగి ప్రదక్షిణంలో గల కళ్యాణ మండపంలో ఈ ఉత్సవం నిర్వహిస్తారు. దీనినే ‘అభిధేయక అభిషేకం’ అని కూడా పిలుస్తారు.
ఉత్సవ మూర్తులకు హోమాలు, అభిషేకాలు, పంచామృత స్నపనతిరుమంజనం నిర్వహివంచిన తర్వాత స్వామి, అమ్మవార్లకు వజ్రకవచం అలంకరించి పురవీధుల్లో ఊరేగింపు నిర్వహిస్తారు. రెండో రోజు ఉత్సవాల్లో భాగంగా ముత్యాల కవచ సమర్పణ చేస్తారు. మూడో రోజున తిరుమంజనాదులు పూర్తిచేసి బంగారు కవచాన్ని అలంకరిస్తారు. ఈ బంగారు కవచాన్ని మళ్ళీ జ్యేష్ఠాభిషేకంలోనే తీస్తారు.