(10వ శతాబ్దికి చెందిన తత్వవేత్త అభినవగుప్తుడి జయంతి నేడు)
సామాన్యశకం పదవ శతాబ్దానికి చెందిన కశ్మీరీ విద్వాంసుడు ఆచార్య అభినవగుప్తుడు భారతీయ సంప్రదాయిక వైజ్ఞానికవేత్తలలో ప్రముఖుడు. విద్వాంసుల కుటుంబంలో జన్మించిన అభినవగుప్తుడు తత్వశాస్త్రం, రసజ్ఞాన శాస్త్రం, సాహిత్యం, సంగీతం, వేదాంతశాస్త్రం వంటి శాస్త్రాల్లో అవిరళ కృషి చేసారు. ప్రత్యేకించి కశ్మీర్ ప్రాంతంలోని శైవం గురించి ఆయన చేసిన వ్యాఖ్యానం విశేషమైనది. శతాబ్దాల తరబడి విస్మరణకు గురైనప్పటికీ ఇటీవల పెరుగుతున్న చైతన్యం కారణంగా అభినవగుప్తుడి తత్వశాస్త్రానికి మళ్ళీ గుర్తింపు లభిస్తోంది. ప్రత్యేకించి క్వాంటమ్ ఫిజిక్స్, క్వాంటమ్ మెకానిక్స్ వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాలతో అభినవగుప్తుడి ప్రతిపాదనలు సరిపోలుతుండడంతో ఆయనపై ఆసక్తి పెరుగుతోంది.
కశ్మీర్ ఏనాటినుంచో భారతీయ ఆధ్యాత్మికతకు పుట్టినిల్లుగా అత్యున్నత గౌరవాన్ని పొందుతోంది. మహాభారత కాలం నుంచి సామాన్యశకం 9వ శతాబ్దం వరకూ వైదిక, వైష్ణవ, శైవ, బౌద్ధ, తాంత్రిక, శాక్తేయ సంప్రదాయాలు విలసిల్లిన క్షేత్రమది. అది సర్వధర్మ సహిష్ణుతకు ఆలవాలంగా నిలిచిన కాలం. సంస్కృతుల మధ్య ఘర్షణలు లేని కాలం. వివిధ విశ్వాసాలు, ఆచార వ్యవహారాలూ సమాంతరంగా ఆచరణలో ఉన్న కాలం. విభిన్న భావజాలాల మధ్య స్పర్ధలు చర్చలతో జరిగిన కాలం. చైతన్యం సమష్ఠిగా వెల్లివిరిసిన కాలం. ఆ ఘనమైన వారసత్వాన్ని సంరక్షించుకోవడం మన చారిత్రక అవసరం.
కశ్మీర్ పరంపరలో ఎందరో గొప్ప సాధువులు, విద్వాంసులుచ కళాకారులు, వ్యాకరణవేత్తలు ఉన్నారు. వారితో పాటే ఎంతోమంది గొప్ప రాజులు కూడా ఉన్నారు. మోసాలతో కాక ప్రత్యక్షయుద్ధాల్లో గెలుపొంది రాజ్యాలను పెంచుకున్న రాజులున్నారు. కశ్మీరదేశాన్ని పరిపాలించిన అటువంటి గొప్ప రాజుల్లో లలితాదిత్య ముక్తాపీడుడు ప్రముఖుడు. ఆయనను నెపోలియన్, అలెగ్జాండర్లతో పోలుస్తారు. నిజానికి ఆయన వారిద్దరూ జయించిన ప్రాంతాల కంటె ఎక్కువ భూభాగాన్ని జయించి పరిపాలించిన రాజు లలితాదిత్యుడు.
అభినవ గుప్తుడు సామాన్యశకం 940 సమయంలో జన్మించాడు. ఆయన తల్లిదండ్రులు విమల, నృసింహగుప్తుడు. శైవయోగంలో ఆయన అభినివేశం, భారతీయ తాత్విక సంప్రదాయాలకు ఆయన చేసిన సేవల కారణంగా ఆయనను ఆచార్యులకే ఆచార్యుడు అని గౌరవించేవారు.
విభిన్న రంగాలలో గణనీయమైన కృషి చేసినప్పటికీ అభినవగుప్తుడి ప్రస్తావన కల్హణుడి రాజతరంగిణిలో కనబడక పోవడం గమనార్హం. రాజతరంగిణి ప్రధానంగా రాజులు, వారి ఆస్థానాలలోని విద్వాంసుల గురించి విస్తృతంగా చర్చించింది. అయితే అభినవగుప్తుడు ఏ రాజు దగ్గర కానీ, లేదా ఎవరి ఆస్థానంలో కానీ లేకపోవడం వల్లనే ఆయన గురించి రాజతరంగిణిలో ప్రస్తావించకపోయి ఉండవచ్చునన్న అంచనాలున్నాయి.
అభినవగుప్తుడు వివిధ శాస్త్రాలకు సంబంధించి 40కి పైగా రచనలు చేసాడు. సిద్ధాంత, క్రమ, భైరవ, యమళ, కౌళ, తంత్ర తదితర శాస్త్రాలకు చెందిన గ్రంథాలు రచించాడు. ఆయన రచనల విస్తృతి ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. అభినవగుప్తుడి రచనలపై నేటికీ ప్రపంచమంతటా 50కిపైగా విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలు జరుగుతున్నాయంటే ఆయన స్థాయిని అర్ధం చేసుకోవచ్చు. ఆనందవర్ధనుడి ‘ధ్వన్యాలోకము’, భరతముని ‘నాట్యశాస్త్రము’లకు అభినవ గుప్తుడి వ్యాఖ్యలు ఆయనకు దేశవ్యాప్తంగా ఆసేతుశీతాచలం ప్రఖ్యాతిని ఆర్జించిపెట్టాయి.
దురదృష్టవశాత్తు, అభినవగుప్తుడి రచనల్లో అత్యధికభాగం లుప్తమైపోయాయి. 12వ శతాబ్దం తర్వాత కశ్మీర్లో నెలకొన్న సంక్షుభిత పరిస్థితుల్లో ఆయన రచనలు ధ్వంసమైపోయాయి. అభినవగుప్తుడు తన 68వ ఏట భైరవ స్తోత్రాన్ని రచించాడట. ఆ స్తోత్రాన్ని పారాయణం చేస్తూ తన 1200 మంది శిష్యులతో భీరవ సమీపంలోని ఒక గుహలోకి ప్రవేశించి, శివుడిలో లీనమైపోయాడంటారు.
కశ్మీర్లో భారతీయ సంస్కృతి ఆనవాళ్ళను చెరిపివేయడానికి ముమ్మరంగా ప్రయత్నాలు జరుగుతున్న నేపథ్యంలో అభినవగుప్తుడి గురించి తెలుసుకోవడం, ఆయనను స్మరించుకోవడం చారిత్రక అవసరం. రాబోయే కొన్నేళ్ళ పాటు ఆయన సహస్రాబ్ది ఉత్సవాలను జరుపుకోవడం ద్వారా కశ్మీర్ ఆధ్యాత్మిక చైతన్యాన్ని, ఘనమైన సాంస్కృతిక వారసత్వాన్నీ ప్రపంచమంతటికీ చాటవలసిన అవసరముంది. భారతీయ తాత్విక చింతనకు అభినవగుప్తుడు అందించిన సేవలను స్మరించుకోవడం, ఆయనకు సరైన నివాళులర్పించుకోవడం భారతీయుల కర్తవ్యం.