ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు ఈ నెల 24 నుంచి జరుగుతాయని తొలుత పేర్కొన్నారు. కానీ తేదీల్లో మార్పు చేశారు. ఈ నెల 21 నుంచే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ఎన్డీయే ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 21, 22 తేదీల్లో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నారు.
రెండ్రోజుల పాటు జరిగే శాసనసభ సమావేశాల్లో ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం, స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక నిర్వహించనున్నారు. అసెంబ్లీ స్పీకర్ గా చింతకాయల అయ్యన్నపాత్రుడ్ని ఎన్నుకోనున్నట్లు సమాచారం. డిప్యూటీ స్పీకర్ పదవిని జనసేన పార్టీకి కేటాయించే అవకాశముంది. ప్రొటెం స్పీకర్ గా గోరంట్ల బుచ్చయ్య చౌదరి వ్యవహరించనున్నట్లు సమాచారం.
శాసనమండలిలో రెండు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఇటీవల వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరిన ఎమ్మెల్సీలు సి.రామచంద్రయ్య, షేక్ ఇక్బాల్ పై మండలి చైర్మన్ అనర్హత వేటు వేశారు. దీంతో ఈ రెండు స్థానాలకు ఉపఎన్నికలు నిర్వహిస్తున్నారు.
ఉప ఎన్నికకు జూన్ 25న నోటిఫికేషన్ విడుదల చేయనుండగా నామినేషన్ల దాఖలుకు జులై 2 తుది గడువుగా అధికారులు నిర్ణయించారు. నామినేషన్లు ఉపసంహరించుకునేందుకు జులై 5 వరకు అవకాశం ఉంది. జులై 12న పోలింగ్ నిర్వహించి, అదే రోజున ఫలితాలు ప్రకటిస్తారు.